Balka Suman: దేశాన్ని, దేశ ప్రజలను అర్థం చేసుకోవడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. దోస్తులకు దోచి పెట్టేందుకు మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు పని చేస్తుందంటూ మండి పడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చే పథకాలు తీసుకు వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు పర్యవసనాలపై శాసన సభలో లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. విద్యుత్తు సరిగ్గా లేక వ్యవసాయ దారులు, పారిశ్రామిక వేత్తలు తీవ్రంగా నష్టపోయారని బాల్క సుమన్ వివరించారు. 


24 గంటలూ ఉచిత విద్యుత్..  
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను తెలంగాణ సీఎం కేసీఆర్ సరిదిద్దుతున్నారని అన్నారు. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అని ఆయన వెల్లడించారు. వ్యవసాయంతో పాటు బలహీన వర్గాలకు ఉచిత కరెంటు ఇవ్వడం సీఎం కేసీఆర్ ఒక్కరికే సాధ్యమైందని తెలిపారు. ఉచిత, 24 గంటల కరెంటు వల్ల రైతుల మరణాలు, ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయని.. దిగుబడులు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పుకొచ్చారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. 


యూపీ, ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. 
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు కొద్ది మంది కోసమే విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. కేంద్రం కుట్రలు ప్రజలకు తెలియాలన్నారు. ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం మన రాష్ట్రానికే కాకుండా మహారాష్ట్ర రైతులకు కూడా సాయం చేసిన గొప్ప మానవతా వాది అని పేర్కొన్నారు. కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందంటూ బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
బీజేపీని కేవలం రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి కూడా తరిమికొట్టాలని బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వం వహించి మరీ బీజేపీని అధికారం నుంచి తొలగించాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగు పడుతుందని చెప్పారు. 


గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఫైర్.. 
తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఒక్క మంచిపనైనా తెలంగాణకు కేంద్రం నుంచి చేయించడం కిషన్ రెడ్డికి చేతకాలేక పోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కిషన్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిని దిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒక దొంగలముఠా అని, ప్రజల కోసం పాటుపడే పార్టీ టీఆర్ఎస్ అని, తెలంగాణ ప్రభుత్వం అన్నారు.