GHMC Anupama Tweets : హీరోయిన్లు తమ ఫోటో షూట్స్‌లో సూపర్ అనేలా ఉన్న కొన్ని ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడమే ఎక్కువగా చేస్తూంటారు. కాస్త అగ్లీగా కనిపించేవాటిని అసలు పోస్ట్ చేయనే చేయరు. కానీ మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం భిన్నం. ఆమె సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఉదయమే గుడ్ మార్నింగ్ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ఆమె ట్వీట్‌లో ఏమీ లేదు. నాలుగు ఫోటోలే ఉన్నాయి.
నాలుగు ఫోటోల్లో ఉంది... చెత్త. నిజంగా చెత్త మాత్రమే. మున్సిపాలిటీ సిబ్బంది సరిగ్గా చెత్త తీసేయకపోవడం వల్ల పేరుకుపోయిన చెత్త ఉంది. ఆ చెత్త దగ్గర కొన్ని ఆవులు ఆహారం వెదుక్కుంటున్నాయి. నిజానికి అక్కడ చెత్త కన్నా ప్లాస్టిక్కే ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ తిని ఎన్నో ఆవులు మృత్యువాత పడుతున్నాయి. ఈ విషయాలే తన ఫోటోల ద్వారా అనుపమ పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. ఎగ్జాట్‌గా ఎక్కడో లొకేషన్ చెప్పాలని కోరింది.
వాస్తవానికి లోకేషన్ ఫోటోను కూడా అనుపమ పరమేశ్వరన్ తన ట్వీట్‌లో జత చేశారు. కానీ గ్రేటర్ సిబ్బంది అనాలోచితంగా ఆ ట్వీట్ పెట్టారు.
వెంటనే పలువురు సిటిజన్లు .. నెటిజన్లుగా మారిపోయి.. గ్రేటర్‌కు సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ మళ్లీ గ్రేటర్ సిబ్బంది రిప్లయ్ ఇవ్వలేదు. సమస్యను పరిష్కరిస్తే ఇచ్చి ఉండేవారు కానీ.. పట్టించుకోలేదు కాబట్టి.. మళ్లీ రిప్లయ్ ఇవ్వలేదన్న అభిప్రాయం నెటిజన్లలో వినిపిస్తోంది.