KCR Not Attending to Opposition Parties Meet: రాష్ట్రపతి ఎన్నికల వ్యూహాల కోసం త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహించనున్న విపక్ష పార్టీల సమావేశానికి టీఆర్ఎస్ హాజరు కావడం లేదు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన అనంతరం వారి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.


కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు దేశవ్యాప్తంగా 19 విపక్ష రాజకీయ పార్టీలకు, సీఎంలకు మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో బుధవారం (జూన్ 15) మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. తాను హాజరు కాకూడదని నిర్ణయించుకోవడమే కాక, పార్టీ తరఫున ప్రతినిధి బృందాన్ని కూడా ఆ సమావేశానికి పంపకూడదని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ వ్యూహాలు రచిస్తూ చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


తొలుత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావుతో కూడిన టీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందాన్ని పంపాలని తొలుత భావించినా పార్టీ నేతలు అభిప్రాయాలు, హాజరైతే కలిగే పరిణామాలను అంచనా వేసి మొత్తానికే దూరంగా ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించారు. 


కాంగ్రెస్, బీజేపీతో సమాన దూరం పాటించాలన్నది టీఆర్‌ఎస్ పార్టీలో మెజారిటీ నేతల అభిప్రాయం. ఒకవేళ టీఆర్‌ఎస్‌ ఈ సమావేశానికి హాజరైతే కాంగ్రెస్‌ ‌పార్టీకి దగ్గర అవుతుందనే తప్పుడు సంకేతాలను పంపుతుందని, అందుకే ఆ సమావేశానికి హాజరు కావొద్దని, పార్టీ నేతలు కేసీఆర్ కు చెప్పినట్లు తెలిసింది. ఆ విపక్షాల భేటీకి కాంగ్రెస్‌ను కూడా మమత ఆహ్వానించడం, అదే భేటీకి టీఆర్‌ఎస్‌ హాజరైతే రాష్ట్రంలో ఎదురు కాబోయే రాజకీయ పరిణామాలు, తద్వారా బీజేపీ చేయబోయే విమర్శలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే, విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబడితే కేసీఆర్ మద్దతిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.


ఇటీవల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్, జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తనదైన శైలిలో వ్యూహం పాటిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనుండగా, జూలై 21న ఫలితాలు వెలువడనున్నాయి. 


Also Read: Weather Updates: వేగంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు