Balagam Mogilaiah: బలగం సినిమాలో క్లైమాక్స్ పాట పాడి అందరినీ కంటతడి పెట్టించిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మంత్రి హరీష్ రావు స్పందించారు. వెంటనే ఆయనకి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో మొగిలయ్యను వరంగల్ నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు వైద్యాధికారులు. ప్రస్తుతానికి ఆయనకి ఎలాంటి హృదయ సంబంధమైన వ్యాధులు లేవని నిమ్స్ డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం మొగిలయ్య డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. దీర్ఘకాలంగా డయాబెటిస్, బీపీ సమస్యలతో మొగిలయ్య బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడని అన్నారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండె సమస్య లేదని నిమ్స్ వైద్యలు నిర్ధారించారు. డయాలసిస్ కొనసాగిస్తూ, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్ డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం నిమ్స్ పాత భవనంలోని ఎమ్మార్సీయూ విభాగంలో నెఫ్రాలజీ HOD డాక్టర్ గంగాధర్ పర్యవేక్షణలో మొగిలయ్యకు చికిత్స అందిస్తున్నారు.
68 ఏళ్లున్న మొగిలయ్యది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం. ఇటీవల బలగం సినిమా క్లైమాక్స్‌లో మానవ సంబంధాల గొప్పతనాన్ని వివరిస్తూ మొగిలయ్య దంపతులు చేసిన గానం ప్రతీ ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే బలగం సినిమాకు బలంగా నిలిచింది. అలా ఒక్కసారిగా రెండు రాష్ట్రాలకు పరిచమైన గాయకుడు మొగిలయ్య గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేదు. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఈ క్రమంలోనే మొగిలయ్యకు గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు.
పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్రకథలు పొట్టపోసుకునేవారు . పూర్వీకుల నుంచి సంప్రదాయంగా అబ్బందీ కళ వారికి. గోదావరి బెల్ట్ చుట్టుపక్కల ఊళ్లలో కథలు చెబుతూ చాలీచాలని సంపాదనతో బతుకు బండి నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మొగిలియ్య కుటుంబం కొన్నేళ్ల క్రితం వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండికి వలస వచ్చింది. అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి పైకప్పు కూలిపోయింది. శ్లాబ్ వేసే స్థోమత లేదు. పరదాల చాటున కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం మొగిలయ్య కుమారుడు స్టీల్ సామాన్ల వ్యాపారమేదో చేస్తున్నాడు.
భార్యభర్తలిద్దరికీ అక్షరం ముక్కరాదు. ఆ సన్నివేశాన్ని బట్టి అప్పటికప్పుడు కథలు, పాటలు ఆశువుగా అల్లి రక్తికట్టించడం వారి ప్రత్యేకత. ఈ క్రమంలో మొగిలయ్యకు బలగం చిత్రంలో బుర్రకథ చెప్పే అవకాశం దర్శకుడు వేణు ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవడంతో మొగిలయ్య దంపతులకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సినిమాలో దాదాపు పావుగంట పాటు సాగిన క్లైమాక్స్ సీన్ లో ఒక్క డైలాగ్ లేకుండా, కేవలం మొగిలయ్య, కొమురమ్మ పాటతోనే పతాక సన్నివేశాన్ని నడిపించాడు దర్శకుడు వేణు. పేరు పేరునా కుటుంబసభ్యుల గురించి చెబుతూ, బంధుత్వాల గురించి, వాటి గొప్పతనం గురించి వివరిస్తూ ఈ పాట సాగుతుంది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు గురించి చెబుతూ సాగే పాటకు.. ఎంత కర్కోటకుడైనా కన్నీరు పెట్టాల్సిందే.