Asha Malaviya: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పర్వతారోహకురాలు, క్రీడాకారిణి ఆశా మాలవ్య స్వీకరించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. మహిళా భద్రత, సాధికారతను సమాజంలోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో.. మాలవ్య దేశవ్యాప్తంగా 25 వేల కిలో మీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. ఈరోజే ఆమె హైదరాబాద్ చేరుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.


ఈ సందర్భంగా ఆశా మాలవ్య మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళ భద్రతకు, మహిళ సాధికారతకు చేపడుతున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆశా కృతజ్ఞతలు తెలియజేశారు. తన సైకిల్ యాత్రలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ని ఆశా హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా ఆశాను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. తన వంతు సాయంగా కొంత నగదు సాయం అందించారు. భవిష్యత్ లో కూడా తన వంతు సహాయం అందిస్తానని భరోసా కల్పించారు.








గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సెలబ్రిటీలు..


ఇటీవల నటి ప్రగ్యా జైస్వాల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ రెజీనా కసాండ్ర. బిగ్ బాస్ తరువాత ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను ఫాన్స్ తో పంచుకుంటున్న ఇనాయ సుల్తానా తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది. శిల్పారామంలోని రాక్ పార్క్ లో రెజినా 'శాకిని డాకిని' సినిమా ప్రొడ్యూసర్ సునీతతో కలిసి మొక్కలు నాటారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని సంగీత దర్శకుడు థమన్ స్వీకరించారు. అంతే కాకుండా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 'థమన్' మాట్లాడుతూ... 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొని మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, ఒక ప్రాణం పోసినట్లుగా గొప్ప అనుభూతి కలిగిందని అన్నారు. ఇప్పటి వరకు 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ద్వారా 16 కోట్లకుపైగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ను థమన్ ప్రశంసించారు.