Potti Sreeramulu: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చనున్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, పరిశోధకుడు, ఉద్యమకారుడు, పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాప రెడ్డి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన మంత్ర వర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 డిసెంబర్ 2న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ప్రారంభించింది. విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. అప్పటి నుంచి వర్సిటీ ఈ పేరుతోనే కొనసాగుతోంది. పదో షెడ్యూల్ లో ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఇప్పటి వరకు పేరు మార్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఈ ఏడాదికి పదేళ్లు. దీంతో వర్సిటీ పేరు మార్చేందుకు మార్గం సుగమమైంది. ఈ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థుల అడ్మిషన్లకు మాత్రమే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా పొట్టి శ్రీరాములు పేరును తొలగించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి పేరును యూనివర్సిటీకి పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.


తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అసంతృప్తి
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పొట్టి శ్రీరాములు పేరు మార్చడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో... రాష్ట్రానికో చెందిన వారు కాదని గుర్తించాలన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడు అని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు యూనివర్సిటీకి ఆ పేరు పెట్టారని, ఇప్పుడు దాన్ని మార్చడం తగదన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డిని తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆయనను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం సరికాదన్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.


సురవరం బయోగ్రఫి
 సురవరం ప్రతాప రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో 1896 మే 28న జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం న్యాయవాద వృత్తిని చేపట్టారు. సురవరం ప్రతాప రెడ్డి గొప్ప పండితుడు. 1926లో ఆయన స్థాపించిన 'గోల్కొండ పత్రిక' తెలంగాణ సాంస్కృతిక ప్రగతిలో మైలురాయిగా నిలిచింది. గోల్కోండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పరిశోధకుడిగా, రచయితగా, పండితుడిగా, ఉద్యమకారుడిగా సురవరం పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 1952లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1953 ఆగస్టు 25న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రుల సామాజిక చరిత్రను రచించినందుకుగానూ 1955లో 'కేంద్ర సాహిత్య అకాడమీ' పురస్కారం లభించింది. తాజాగా సురవరం సేవలను గుర్తించిన తెలంగాణ సర్కార్ తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించింది.