Apsara Murder Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అప్సర హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. నిందితుడు వెంకట సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న శంషాబాద్ పోలీసులకు సంచనాలు విషయాలు తెలుస్తున్నాయి. అప్సరను చంపేందుకు సాయికృష్ణ పదిహేను రోజుల ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలుసుకొని పోలీసులు షాకయ్యారు. అంతేకాదండోయ్.. ఆమెను చంపాకా పూడ్చి పెట్టేందుకు గొయ్యి కూడా తవ్వించాడట. కానీ అది కుదరకపోవడంతో దాన్ని పూడ్చేసి మరోచోట మృతదేహాన్ని పడేసేందుకు ప్లాన్ బీ కూడా సిద్ధం చేశాడట. 


అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రీకన్ స్ట్రక్షన్ ప్రారంభించారు. జూన్ 3వ తేదీన హత్య జరిగిన నర్కూడ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ హత్య చేసిన తీరును నిందితుడిని అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఈక్రమంలోనే సాయికృష్ణ.. అప్సరను ముందుగానే చంపేందుకు ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది. అయితే అప్సర వేధింపులు తాళలేని సాయికృష్ణ ఆమెను చంపేయాలనుకున్నాడు. గూగుల్ లో వెతికి మరీ పథకం పన్నాడు.


సరూర్ నగర్ లో తాను పూజారిగా పని చేసే గుడి వెనుక ఉన్న ఆసుపత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాకా.. ఆ స్థలంలో ఆమెను పాతి పెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగులు పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్ వద్ద స్థలం ఉందని గుర్తించి తన ప్లాన్ ను అమలు చేశాడు.


నర్కూడలో క్రైమ్ సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా అప్సర మృతదేహాన్ని పూడ్చేసిన మ్యాన్ హోల్ దగ్గరికి తీసుకెళ్లారు. రంగారెడ్డి కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించడంతో.. నేడు, రేపు అప్సర కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.   



ఇద్దరి మధ్య వివాహేతర బంధం!


సరూర్‌నగర్‌ ప్రాంతంలో జరిగిన అప్సర హత్య కేసు సంచలనంగా మారింది. వెంకట సాయికృష్ణ, అప్సర ఒకే వీధిలో ఉండేవారు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై ఓ పాప కూడా ఉంది.  అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్ప‌టికే ఒక‌సారి ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో సాయికృష్ణ అబార్ష‌న్ చేయించాడు.. తాజాగా అప్స‌ర మ‌రోసారి గ‌ర్భం దాల్చ‌డంతో పెళ్లి చేసుకోవాల‌ని గ‌త రెండు నెలలుగా సాయి పై తీవ్ర ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ది. దీంతో ఆమెనుంచి తప్పించుకునేందుకు హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకుని ప‌క్క ప్లాన్ సిద్ధం చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. 


హత్య చేసిన తర్వాత రోజంతా కారులోనే మృతదేహం 


అప్సరను హత్య చేసిన తర్వాత అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చిన సాయి.. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటి ముందే పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి మ్యాన్‌ హోల్ లోంచి కిందికి పడేశాడు. మ్యాన్‌హోల్‌లో డెడ్ బాడీ వేసిన తర్వాత  అందులో మట్టిని నింపాడు. మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుందని మట్టి నింపుతున్నట్లు అందర్నీ నమ్మించాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపించాడు. అప్సర కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతో పాటు నిందితుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌ ట్రాక్‌ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం రోజున సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది.