Gaddar News: ప్రజాగాయకుడు, పద్యకారుడు గద్దర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం (Anti Terrorism Forum - ఏటీఎఫ్) ఖండించింది. ఈ మేరకు యాంటీ టెర్రరిజం ఫోరం కన్వీనర్ డాక్టర్ రావినూతల శశిధర్ ఓ వీడియోను విడుదల చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లుగా శశిధర్ వెల్లడించారు.


నిషేదిత మావోయిస్టు (నక్సలైట్) భావజాలానికి సిద్ధాంత కర్త అయిన గద్దర్ అంతిమ సంస్కారంలో పోలీసులతో గన్ సెల్యూట్ చేయించడం తీవ్రవాదంపై పోరులో పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చను తెస్తుందని అన్నారు. నక్సలైట్ల (మావోయిస్టుల) మారణహోమంలో బలిదానాలు చేసిన పోలీసులు, జాతీయవాదుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం అవమాన పరిచిందని అన్నారు. గద్దర్ అంతిమయాత్ర చూస్తే అర్బన్ నక్సలైట్లు ఏ రకమైన ఏకో సిస్టం నిర్మాణం చేసుకున్నారో అర్థం అవుతుందని శశిధర్ లేఖలో పేర్కొన్నారు.



వాగ్గేయకారుడు, ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ అల్వాల్‌లోని మహాభోది స్కూల్ ప్రాంగణంలో గద్దర్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మహాబోధి స్కూల్ ప్రాంగణానికి వివిధ రాజకీయప్రముఖులు, మంత్రులు, విపక్ష నేతలతోపాటు, సినీ రంగం నుంచి ఆర్ నారాయణ మూర్తి తదితరులు హాజరు అయ్యారు. అంత్యక్రియల సమయంలో కళాకారులు ప్రార్థన చేస్తూ గద్దర్ కు నివాళి అర్పించారు.


అంత్యక్రియల్లో ఓ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ మరణం


గద్దర్ అంత్యక్రియల్లో అభిమానులను కట్టడి చేయకపోవడంతో అపశ్రుతి చోటు చేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఆయనను సియాసత్ వార్తాసంస్థ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గా గుర్తించారు. ఈయన గద్దర్‌కు సన్నిహితుడుగా ఉండేవారని చెబుతున్నారు. గద్దర్ ఇంటి వద్ద జహీరుద్దీన్ అలీఖాన్ కు గుండెపోటు వచ్చి కింద పడిపోయినట్లుగా భావిస్తున్నారు. పడిపోయిన జహీరుద్దీన్ అలీ ఖాన్‌ను స్థానికులు పక్కనే ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లుగా డాక్టర్ వెల్లడించినట్లుగా సమాచారం.


సీఎం కేసీఆర్ నివాళి


ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గద్దర్ (Gaddar News) భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఇందుకోసం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం గద్దర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ కలిసి పరామర్శించారు. అల్వాల్‌లోని గ‌ద్దర్ ఇంటికి సోమ‌వారం సాయంత్రం (ఆగస్టు 7) కేసీఆర్ చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న ఇతర బీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు. వారు కూడా గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు.