Amit Shah TS Tour: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. బీజేపీ చేవెళ్లలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా చేవెళ్లకు 6 గంటలకు చేరుకుంటారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు సభ ముగించుకొని రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి పయనం అవుతారు. విజయ సంకల్ప సభకు సంబధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది.
12 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి మరీ..
చేవెళ్లలో ఏర్పాటు చేస్తున్న విజయ సంకల్ప సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ కోసం మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవెందర్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 2,789 పోలింగ్ బూత్ ల నుంచి కార్యకర్తలు, కమిటీ సభ్యులు సభకు హాజరు అవుతారని పేర్కొన్నారు. సభకు వచ్చే వారికి తామేం బీరు, బిర్యానీ, డబ్బులు వంటివి ఇవ్వట్లేదని... అబిమానంతోనే వారంతా వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే సభకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా ఉండేందుకు తాగేందుకు మంచి నీళ్ల దగ్గర నుంచి పార్కింగ్ వరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
పలు మార్గాల్లో ఆంక్షలు
ఈ క్రమంలోనే చేవెళ్ల బహిరంగ సభకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గరగా ఈ సభ జరుగుతుండడం వల్ల నగరం నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో చేవెళ్లకు రానున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. అదే విధంగా సభా స్థలి వద్ద కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం నాలుగు చోట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.