Etela Vs Revanth Reddy : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రుజువు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌పై చేశారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణానికి రావాలని ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేశారు. రేవంత్ సవాల్ పై ఈటల రాజేందర్  స్పందించారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదన్నారు. తనకు కూడా ఆత్మవిశ్వాసం ఉందన్న ఆయన అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదన్నారు. తాను దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదని చెప్పుకొచ్చారు. దీనిపై సరైన సమయంలో జవాబిస్తానని ఈటల వెల్లడించారు.  


రేపు సమాధానం చెప్తా 


రేవంత్ రెడ్డి సవాల్‌కు స్పందించిన ఈటల... తాను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. ధర్మం కోసం, ప్రజల కోసం ఆ విధంగా మాట్లాడానన్నారు. తానెప్పుడూ ఎదుటి వారిని కించపరిచే వ్యక్తిని కాదన్నారు. ఈ విషయంపై  రేపు మాట్లాడతానన్న ఈటల.. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు. 


రేవంత్ రెడ్డి ప్రమాణం 


బీజేపీ నేత ఈటల రాజేందర్ తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని..  ఏ ఆధారం లేని వారికి దేవుడే ఆధారమని.. అందుకే  భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. మునుగోడు ఉపఎన్నికల్లో  కేసీఆర్ వద్ద నుంచి తాము ఒక్క రూపాయి తీసుకున్నా సర్వనాశనం అయిపోతామన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో  బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వందల కోట్లు ఖర్చుపెట్టాయన్నారు. ఒక్క మద్యం అమ్మకాలే మూడు వందల కోట్లు నమోదయ్యాయన్నారు. అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నానని.. చివరి రక్తపు బొట్టు  వరకూ కేసీఆర్ తో పోరాడుతానన్నారు. గర్భగుడిలో ప్రమాణం చేసి చెబుతున్నానని కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదన్నారు.   కేసీఆర్‌తో కొట్లాడటానికే మా జీవితాలు ధారపోస్తున్నామని..  నన్ను అమ్ముడుపోయారని అంటావా అని ఈటలపై మండిపడ్డారు.  కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు..ఇది చిల్లర రాజకీయం కాదు.. పోరాటమని రేవంత్ స్పష్టం చేశారు.  నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు.. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదన్నారు.  నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. నా ఏకైక లక్ష్యం.. కేసీఆర్ ను గద్దె దించడమేనని స్పష్టం చేశారు. 


మునుగోడు ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి పంచకుండా ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. రూపాయి కూడా పంచకపోయినా పాల్వాయి స్రవంతికి పాతికవేలు ఓట్లు వచ్చాయన్నారు. అసలు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచకుండా.. ప్రచారం చేయకండా.. నామినేషన్లు వేసి నిర్ణయాన్ని ఓటర్లకు వదిలేద్దామని పాల్వాయి స్రవంతి చేసిన సవాల్‌కు బీజేపీ, బీఆర్ఎస్ స్పందించలేదన్నారు.  మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ పాతిక ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకుంటే తాను పోరాడానని.. ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదన్నారు.