తెలంగాణ విమోచన దిన వేడుకల కోసం కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సెప్టెంబరు 17న ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఒక్కరోజు ముందే అమిత్ షా హైదరాబాద్‌కు వస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 16న రాత్రి 7.55 గంటలకు ఔరంగాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఆర్పీఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. 17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుని తెలంగాణ విమోచన దిన వేడుకల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో తెలంగాణ ప్రజల నుద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు.
హైదరాబాద్‌కు బండి సంజయ్
ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన ఎంపీ బండి సంజయ్ నేడు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బండి సంజయ్‌కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు బండి సంజయ్ తెలిపారు. ఇండియాలో ఎన్నారైలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్లు చాలా ఉన్నాయని, అందుకే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. భారతీయులందరూ అమెరికాలో గల్లా ఎగరేసుకొని తిరుగుతున్నామంటే అమెరికాలో మోదీకి ఉన్న గౌరవమే అని అన్నారు.
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప అభివృద్ధి చెందబోదని అమెరికాలోని తెలంగాణ వాసులు చెప్పినట్లు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో దసరా, సంక్రాంతి వచ్చినప్పుడు ఎలాగైతే సిటీ ఖాళీ అవుతుందో అదే విధంగా దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అమెరికాలోని భారత పౌరులు బీజేపీకి ఓటేసేందుకు వస్తామని చెప్పారని బండి సంజయ్ అన్నారు.