Amit Shah Speech At Tukkuguda Meeting: అధికార పార్టీ టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని, డబుల్ ఇంజిన్ సర్కార్‌ వస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సీఎం కేసీఆర్‌‌ను తరిమేందుకు రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, ఆ నిజాం ప్రభువును గద్దె దించేందుకే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేశారని పేర్కొన్నారు. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని, తెలంగాణ ప్రజలను రజాకార్ల పాలన నుంచి విముక్తి కల్పించేందుకు యాత్ర చేపట్టారని అమిత్ షా అన్నారు. అయితే MIM పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచనదినాన్ని జరపలేదని వ్యాఖ్యానించారు.


కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా.. 
బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర (Bandi Sanjay Praja Sangrama Yatra) ముగింపు సందర్భంగా తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన భారీ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణను సీఎం కేసీఆర్ మరో బెంగాల్ చేస్తున్నారు. కేసీఆర్‌ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.లక్ష రుణమాఫీ హామీ అమలు చేయలేదని విమర్శించారు. బీజేపీ గెలిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు హామీ నెరవేరుతుందన్నారు. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. 






కేంద్రం పథకాల పేర్లు మార్చడం తప్ప, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్‌ 45 డిగ్రీల ఎండలో 660 కి.మీ. నడవగా, పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు సైతం ఆయన వెంట ఉన్నామని ధీమా ఇచ్చారని చెప్పారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా మీ వెంట మేముంటాం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన బీజేపీ.. బల్దియా ఎన్నికల్లో 40కి పైగా సీట్లు గెలిచిందంటే టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత అర్థమవుతోందన్నారు.


ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయట్లేదు..?
పాలమూరు ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ ఎందుకు పూర్తి చేయట్లేదు..?. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే ఆయన పూర్తి చేస్తారు. ధాన్యం కొనట్లేదని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గాంధీ, ఉస్మానియాను పట్టించుకోని సీఎం కేసీఆర్ కొత్త ఆసుపత్రులు నిర్మిస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు అమిత్ షా. నగరంలో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానని మోసం చేస్తున్నారు. వరంగల్‌కు సైనిక్‌ స్కూల్‌ను మంజూరు చేస్తే పట్టించుకోవట్లేదని చెప్పారు. 


కేసీఆర్‌ హత్యా రాజకీయాలు మొదలుపెట్టారు
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ హత్యా రాజకీయాలు మొదలుపెట్టారని, బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ను పొట్టనపెట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు అవిభక్త కవలలు అని, మీరు ఇలాంటి పార్టీలను నమ్మవద్దు అని కోరారు. దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు అని అమిత్ షా ప్రశ్నించారు. పేదలకు రూ.5 లక్షల వైద్యం సహాయం అందే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. కేంద్రం నిధులివ్వడంతోనే ప్రధాని గ్రామీణ సడక్ యోజన కింద గ్రామగ్రామాలకు రోడ్లు వేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు.


Also Read: Bandi Sanjay On KCR : కేసీఆర్ పాలనలో శ్రీలంకలా తెలంగాణ - గోల్కొండ కోటపై కాషాయ జెండా ఖాయమన్న బండి సంజయ్ 


Also Read: Kishan Reddy On KCR : తెలంగాణను కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చారా, ఇక్కడి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి