Hyderabad News: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ లో మంగళవారం రోజు ప్రారంభం అయింది. దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజియన్ సెంటర్ ను ప్రారంభించినట్లు అమెజాన్ ఆసియా ఫసిఫిక్ రీజియన్ ప్రకటించింది. ఈ కొత్త సెంటర్ 2030 నాటికి సుమారు రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడులతో సంవత్సరానికి సగటున 48 వేల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది.
ఏడబ్ల్యూఎస్ సెంటర్ ను స్వాగతించిన మంత్రి కేటీఆర్..
హైదరాబాద్ లో ప్రారంభించిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ భవిష్యత్తులో రూ.36,300 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో దేశంలోనే ప్రగతిశీల డేటా సెంటర్ హబ్ గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో క్లౌడ్ కంప్యూటింగ్ శక్తి, అవసరాన్ని గుర్తించామన్న ఆయన.. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కల్గేలా ఈ-గవర్నెన్స్, పురపాలక రంగాల్లో మెరుగైన సేవలు, కార్యకలాపాల కోసం ఎమెజాన్ వెబ్ సర్వీసెస్ తో కలిసి పని చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ లోని కొత్త అమెజాన్ కేంద్రం ద్వారా దేశంలోని అనేక సంస్థలు, అంకురాల్, ప్రభుత్వ రంగ సంస్థలకు మరిన్ని ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహద పడుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో డేటా కేంద్రం ఏర్పాటు కోసం అమెజాన్ 2020 నవంబర్ 6వ తేదీన భారీ పెట్టుబడి పెడుతున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీస్ ప్రకటించింది. డేటా కేంద్రాల ఏర్పాటు కోసం రూ.20,761 కోట్ల రూపాయలు పెట్టబడులు పెట్టనున్నట్లు గతంలోనే అమెజాన్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గతంలో కూడా వ్యాఖ్యానించారు. తాజాగా డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తూ... వినియోగదారుల సేవల కోసం అధునాతన సాంకేతికతలను ఉపయోగించనున్నారు.