హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ వినూత్నమైన కార్యానికి శ్రీకారం చుట్టింది. సర్జికల్ ట్రైనింగ్ ఆన్ వీల్స్ (Surgical Training on Wheels) పేరుతో ఓ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఓ బస్సు 100 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలను చుట్టిరానుంది. 


ప్రపంచ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సహకారంతో ఏఐజీ హాస్పిటల్స్ కలిసి ఈ బస్సులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సర్జికల్ ట్రైనింగ్ సామగ్రిని ఏర్పాటు చేశారు. ఈ బస్సు దక్షిణ భారత దేశంలోని 14 ప్రధాన నగరాలను చుట్టి రానుంది. జనరల్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, ఆర్థోపెడిక్, క్యాన్సర్, కార్డియాక్ సర్జన్స్ సహా దాదాపు 2 వేల మంది వివిధ విభాగాలకు చెందిన సర్జన్లకు శిక్షణ ఇచ్చేలా ఈ వాహనాన్ని డిజైన్ చేశారు. రూరల్ ఏరియాల్లో ఉండే సర్జన్లకు సైతం మెరుగైన శిక్షణ ఇవ్వడమే తమ ప్రాధాన్యం అని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. 


‘‘ఇందులో మొత్తం 16 సెక్షన్లు ఉంటాయి. వీటిలో ఎనిమిది వెట్-ల్యాబ్ ట్రైనింగ్ కోసం ఉంటాయి. వీటిని అడ్వాన్స్ అనాస్టోమోసిస్‌ లాంటి బేసిక్ ప్రొసీజర్స్ కు ఉపయోగించవచ్చు. మిగిలిన ఎనిమిది సిమ్యులేషన్ ట్రైనింగ్ కోసం వాడతారు. ఇక్కడ సర్జన్లు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసే అనుభవాన్ని పొందవచ్చు.’’ అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సిమ్యులేటర్ సూట్ అనేది సర్జన్ కు బేసిక్ స్కిల్ నుంచి క్లిష్టమైన సర్జరీలు చేయడంలో ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు.


‘‘సర్జికల్ ట్రైనింగ్ ఆన్ వీల్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది రిమోట్ ఏరియాలకు కూడా సులభంగా చేరుకోగలదు. పరిమితులకు లోబడి పని చేసే సర్జన్లకు కూడా మెరుగైన శిక్షణ అందుతుంది. మెడికల్ స్కూల్స్, టీచింగ్ హాస్పిటల్స్ కు ఈ సర్జికల్ ట్రైనింగ్ ఆన్ వీల్స్ చేరుకొని సర్జరీలపై శిక్షణను అందిస్తుంది’’ అని ఏఐజీ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ డీవీ రావు తెలిపారు.