Actress Lishi Ganesh name in Radisson Hotel Drugs Case: గచ్చిబౌలి రాడిసన్‌ బ్లూ హోటల్‌ లో దొరికిన డ్రగ్స్‌ కేసులో పోలీసులు ఓ కొత్త పేరును నిందితుల కింద చేర్చారు. ఆమె ఓ నటి కాగా.. ఆమెను పిలిచి ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. నటి లిషి గణేష్‌ పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈమెతో పాటు ఈమె సోదరి పేర్లు గతంలో కూడా డ్రగ్స్ వ్యవహారంలో వినిపించాయి. ఈ హోటల్ లో సోమవారం బీజేపీ నేత తనయుడైన గజ్జల వివేకానంద ఈ డ్రగ్స్‌ పార్టీ ఇచ్చారని పోలీసులు చెప్పారు. అయితే ఆ పార్టీకి లిషి కూడా వెళ్లినట్లు తాము గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఆమెను కచ్చితంగా పిలిచి ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు. 


నటి లిషి గణేష్ యూట్యూబర్‌గా ఉన్నారు. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ నటించింది. జియోమెట్రీ బాక్స్‌ లాంటి షార్ట్‌ ఫిల్మ్‌తో నటిగా ఆమె ఓ గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌ వీడియోలతోనూ ఆమె తన సబ్‌స్క్రైబర్లకు చేరువలో ఉంటారు. 2022లో కూడా ఈమె పేరు డ్రగ్స్ కేసులో వినిపించింది. అప్పుడు మింక్‌ పబ్‌ డ్రగ్‌ కేసు సంచలనం రేపింది. అందులో లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండిస్తూ చీజ్‌ బజ్జీలు తినడానికి వెళ్లామంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అప్పుడు ఆమెను నెటిజన్లు బాగా ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్‌ పేరు రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో వినిపించడం చర్చనీయాంశం అయింది. లిషితో పాటు శ్వేత అనే వీఐపీ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చినట్లు తెలుస్తోంది.


సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్
గచ్చిబౌలి ర్యాడిసన్ బ్లూ హోటల్ లో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం వచ్చిందని.. అందుకే ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. కొకైన్ పార్టీ వ్యవహారంలో మంజీరా గ్రూప్ డైరెక్టర్ జి. వివేకానందను అరెస్ట్ చేశామని చెప్పారు. అతనితో పాటు నిర్భయ్, కేదార్ లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాము నిర్వహించిన వైద్య పరీక్షల్లో ముగ్గురు కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని చెప్పారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ పై తాము కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. ఇక్కడి నిందితులకు సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్మినట్లు తెలిసిందని సీపీ వివరించారు. అతని కోసం వెతుకుతున్నామని.. వారు డేటాని డిలీట్ చేసినా.. రీట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.


పట్టుబడిన వారిలో వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడని సీపీ చెప్పారు. ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారని అన్నారు. డ్రగ్స్ టెస్ట్ లో వివేకానందతో పాటు నిర్భయ్, కేదార్ కు కూడా పాజిటివ్ వచ్చిందని అన్నారు. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించగా.. కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందని వివరించారు. మొత్తం ఈ పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించామని సీపీ వెల్లడించారు. వివేకా నంద, నిర్భయ్, కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని వివరించారు. వారు డ్రగ్స్ ద్వారా సంపాదించినట్లు అనుమానిస్తున్నామని.. ఆ ఆస్తులను కూడా తాము అటాచ్ చేస్తున్నామని సీవీ అవినాష్ మహంతి తెలిపారు.