Actor Nagarjuna Video On Telangana Tourism: తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలపై సినిమాప్రముఖులు ప్రచారం చేయాలని మొన్నీ మధ్య తనను కలిసిన సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ చెప్పారు. అన్నట్టుగానే తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, టెంపుల్ టూరిజం, తెలంగాణ వంటకాలపై కింగ్ నాగార్జున ప్రత్యేక వీడియో చేశారు. తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాలు వివరించారు. రుచి చూడాల్సిన వంటకాల గురించి చెప్పారు. దర్శించుకోదగ్గ దేవాలయాలను చూపించారు. మొత్తానికి వీడియో చూడముచ్చటగా ఉంది.
వీడియోలో నాగార్జున ఏమన్నారంటే" చిన్నప్పటి నుంచి తెలంగాణ అంతా తిరిగాను. చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. జోడేఘాట్ వ్యాలీ, ఆదిలాబాద్ దగ్గర ఉన్న మిట్టేరు వాటర్‌ఫాల్స్, బొగతా జలపాతం. ఆలయాలు గురించి చెప్పుకుంటే వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి. రామప్ప ఆలయం. ఇది యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ కట్టడం. మీరంతా వచ్చి చూడాలి. చాలా అందంగా ఉంటుంది. యాదగిరి గుట్ట, నేను చాలా చాలా సార్లు వెళ్లాను. చాలా ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. వచ్చిన వాళ్లు యాదగిరిగుట్టను దర్శించుకోవడం మిస్ కావద్దు.
ఫుడ్ విషయానికి వస్తే... తెలంగాణలో నాకు నచ్చింది ఏంటంటే... జొన్న రొట్టేతో అంకాపూర్ చికెన్. స్నాక్స్‌లో చెప్పాలంటే సర్వపిండితో చేసే వంటకాలు. చాలా ఇష్టం. ఇక మీకు తెలియంది ఏముంది. ఇరానీ చాయ్, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫేమస్ ఫుడ్. ఇవన్నీ మర్చిపోలేనివి. మీతో చెబుతుంటేనే నోటిలో నీళ్లు ఊరుతున్నాయి.
తెలంగాణలో నాకు నచ్చింది ప్రజల ఆత్మీయత. ప్రతి ఒక్కర్నీ సాదరంగా ఆహ్వానిస్తారు. ఏ భాష వాళ్లనైనా ప్రేమతో స్వాగతం పలుకుతారు. చాలా అందంగా ఉంటుంది. మీరంతా తప్పకుండా తెలంగాణ రండీ. వచ్చి ఎంజాయ్ చేయండి. జరూర్ ఆనా హమారా తెలంగాణ అని వీడియోను ముగించారు.
Also Read: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
సంధ్య థియేటర్ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డితో కొందరు సినీ ప్రముఖులు వెళ్లి కలిశారు. అలా కలిసిన వారిలో నటుడు నాగార్జున కూడా ఉన్నారు. ఆ మీటింగ్‌లో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతిని, పర్యాటకాన్ని, ఆధ్యాత్మికతను ప్రచారం చేయాలని సూచించారు. సినీ ప్రముఖులు ప్రచారం చేస్తే ఎక్కువ ప్రాచుర్యం వస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా సినీ ప్రముఖులు ప్రచారం చేయాలన్నారు.
ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సినీ హీరోలు, నటులు చేపడితే రీచ్ ఎక్కువ ఉంటుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది షేర్ చేస్తారని వారి అభిమానులు షేర్ చేస్తారని వినే వాళ్లు ఉంటారని చెప్పుకొచ్చారు. అందుకే ఎక్కువ మంది ఇలాంటి ప్రచారాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ పిలుపు మేరకు ఇప్పటికే వివిధ సినీ హీరోలు, నటుడు డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వాటితో కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ టైంలోనే నటులు ఇలాంటి ప్రచారంలో పాల్గొనే వాళ్లు. రేవంత్ సూచనతో సినిమా రిలీజ్ లేకపోయినా ప్రభాస్ లాంటి నటులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం కల్పిస్తున్నారు. అదే మాదిరిగా పర్యాటకంపై కూడా నాగార్జున వీడియో చేశారు.
Also Read: ట్రాన్స్‌జెండర్ జీవితాల్లో వెలుగులు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో పెరుగుతున్న గౌరవం