iBomma  Case Update: తెలుగు చలన చిత్ర పరిశ్రమను  పీడిస్తున్న పైరసీ భూతం ఐ బొమ్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారిస్తున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం ఒక వెబ్‌సైట్‌ను నడపడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నకిలీ పత్రాలతో పౌరసత్వాన్ని  పొందే వరకు ఈ దందా సాగిందంటే దీని వెనుక ఎంతటి పటిష్టమైన నెట్‌వర్క్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Continues below advertisement

మూడోసారి కస్టడీ- 12 రోజుల విచారణ 

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు అనుమతితో పోలీసులు మూడోసారి కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం మూడు వేర్వేరు కేసుల్లో, ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు విచారించేందుకు పోలీసులకు అనుమతి లభించింది. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన విచారణలో ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారే ప్రసాద్‌ అండ్ ప్రహ్లాద్‌. వీరిద్దరిలో ఒకరు రవికి అత్యంత సన్నిహితుడు కాగా, మరొక వ్యక్తి గురించి ఎవరికీ సమాచారం తెలియడం లేదు. దీనిపై రవే విభిన్న సమాధానాలు వినిపిస్తున్నాడు. 

ప్రహ్లాద్‌ ఎవరు?

ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన, కీలకమైన మలుపు ప్రహ్లాద్‌ అనే పేరు. పోలీసుల విచారణలో రవి పొంతన లేని సమాధానాలు ఇస్తుండటం అధికారులను అయోమయానికి గురి చేస్తోంది. తొలిసారి విచారించినప్పుడు ప్రహ్లాద్‌ అనే వ్యక్తి అమీర్‌పేటలో కోచింగ్‌ తీసుకునే సమయంలో పరిచయమయ్యాడని చెప్పిన రవి, రెండోసారి విచారణలో అసలు అతను ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. 

Continues below advertisement

అయితే రవి వాంగ్మూలానికి భిన్నంగా ఆధారాలు మరోలా ఉన్నాయి. ఇమ్మడి రవి తన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాలన్నీ ఈ ప్రహ్లాద్‌ పేరుతోనే సృష్టించాడు. ఇంతటితో  ఆగకుండా కరేబియన్ దీవుల్లోని సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌ అనే దేశ పౌరసత్వానికి కూడా ప్రహ్లాద్‌ పేరుతో పొందాడు. చివరకు ఐ బొమ్మ వెబ్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ కూడా ఇదే పేరుతో ఉండటం చూస్తుంటే  చట్టం కళ్లుగప్పడానికి రవి ఎంతటి వ్యూహాత్మకమైన ప్లాన్ వేశాడో స్పష్టమవుతోంది. 

ప్రసాద్‌- టెక్నికల్ రహస్యాలు

ఈ దందాలో రవికి సహాయపడిన మరో వ్యక్తి విశాఖపట్నానికి చెందిన ప్రసాద్, ఇతను రవికి పదో తరగతి నుంచే స్నేహితుడని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రసాద్‌ను విచారించిన పోలీసులు అతని నుంచి కీలక వాంగ్మూలం తీసుకున్నారు. ఇమ్మడి రవి కేవలం అడ్మిన్‌‌ పనులకే పరిమితం కాకుండా థియేటర్లలో విడుదలైన హెచ్‌డీ సినిమాలను ఎలా పైరసీ చేశారు, వాటిని వెబ్‌సైట్‌లో ఎలా అప్‌లోడ్‌ చేస్తారు అనే సాంకేతిక అంశాలపై పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. 

పరిశ్రమపై ప్రభావం- భవిష్యత్

ఐబొమ్మ వంటి వెబ్‌సైట్‌ కారణంగా చిన్న నిర్మాతలు మొదలుకొని బడా స్టార్‌ హీరోల సినిమాల వరకు అన్నీ తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. నాంపలి కోర్టులో ప్రస్తుతం జరుగుతున్న ఈ విచారణతో పైరసీ మూలాలు కదిలిపోతున్నాయని టాలీవుడ్‌వర్గాలు ఆశిస్తున్నాయి.