Bandi Bhagirath POCSO Case | హైదరాబాద్: బండి భగీరథ్‌కు మేడ్చల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రెండు వారాలపాటు (మే 29 వరకు) రిమాండ్ విధించగా.. అతడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడానికి ముందు సిట్ అధికారులు దాదాపు 2 గంటలపాటు భగీరథ్‌ను ప్రశ్నించారు. తరువాత మేడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడికల్ టెస్టులు నిర్వహించిన తరువాత కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు.
లొంగుబాటా? అదుపులోకి తీసుకున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల వద్దకు చేరుకున్నారు. అయితే, ఆయన పోలీసుల ముందుకు వచ్చిన తీరుపై ఇప్పుడు భిన్నమైన వాదనలు తెరపైకి రావడం విశేషం. హైకోర్టు మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈ కేసు ఉత్కంఠ రేపుతోంది.
ఈ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన కుమారుడు చట్టాన్ని గౌరవిస్తూ స్వచ్ఛందంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడని స్పష్టం చేశారు. "నా కుమారుడు ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నప్పటికీ.. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని నేనే స్వయంగా సూచించాను" అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. న్యాయవాదుల ద్వారా భగీరథ్‌ను విచారణ నిమిత్తం అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ వ్యవహారంలో పోలీసుల వెర్షన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. బండి భగీరథ్ స్వచ్ఛందంగా లొంగిపోలేదని, తామే రంగంలోకి దిగి అప్పా (APPA) జంక్షన్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బండి భగీరథ్ కోసం ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలలో ప్రత్యేక పోలీస్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయని, పక్కా సమాచారంతోనే ఆయన్ను పట్టుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.
మైనర్ బాలిక ఫిర్యాదు.. పోక్సో కేసు నమోదు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫామ్‌హౌస్‌లో ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలైన బాలిక మరియు ఆమె కుటుంబ సభ్యులు మే మొదటి వారంలో పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 8వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై కేసు నమోదు అయింది. మైనర్ బాలిక కావడంతో పోలీసులు తీవ్రమైన పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 11, 12లతో పాటు, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 74, 75 (మహిళలపై వేధింపులు, దాడి) కింద కేసు నమోదు చేశారు.
