YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి బయటకు రాకుండా తనను పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల  ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ... కేసీఆర్ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని విమర్శించారు. పోలీసులను జీతగాళ్లలా వాడుకుంటున్నారన్నారు. పోలీసులు  BRS పార్టీ కార్యకర్తలుగా మారిపోయారన్నారు. తనను అడ్డుకోవడమే అందుకు రుజువన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా, ఒక సిటిజన్ గా హైకోర్టుకి వెళ్లడానికి హక్కు లేదా? అని ఆమె ప్రశ్నించారు. తాను హౌజ్ అరెస్ట్ లో కూడా లేనన్నారు. నోటీస్ ఏది అని పోలీస్ లను అడిగితే దిక్కులు చూస్తున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. 


బంగారు తెలంగాణ అంటే ఇదేనా?


"ఆమరణ దీక్ష చేస్తే చుట్టుపక్కల కర్ఫ్యూ విధించారు. ఎక్కడ చూసినా బారికేడ్స్ పెట్టారు. 100ల సంఖ్యలో పోలీసులు పెట్టారు. మీడియా తప్పితే కార్యకర్తలను కూడా రానివ్వలేదు. వచ్చిన వాళ్లను నానా రకాలుగా హింసపెట్టారు. ఇవన్నీ సరిపోలేదు అన్నట్లు ఇప్పటికీ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలను రానివ్వడం లేదు. కోర్టుకి వెళ్దామని అడుగు బయట పెడితే అనుమతి లేదు అని అంటున్నారు. ఏ ఇతర ప్రతిపక్ష పార్టీ కైనా వారి ఇంటి చుట్టూ ఇంత మంది పోలీసులు ఉన్నారా? హౌజ్ అరెస్ట్ నోటీస్ ఇవ్వకుండా ఇలా చిత్రహింసలకు గురి చేశారా? ఇతర పార్టీ అధ్యక్షుల ఇళ్లకు కార్యకర్తల్ని రానివ్వకుండా ఉన్నారా? ఒక్క మా YSR తెలంగాణ పార్టీకే ఎందుకు ఈ వివక్ష. మమ్మల్ని ఎందుకు అడుగు బయట పెట్టనివ్వడం లేదో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యమా, కాదా? ఇక్కడ హక్కులు లేవా? కేసీఆర్ ది తాలిబాన్ రాజ్యం అనుకుంటున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేస్తున్నారు. " - వైఎస్ షర్మిల 


కేసీఆర్ తాలిబాన్ అధ్యక్షుడు 


వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల ఆదరణ గెలుచుకుంటుందని కేసీఆర్ కి భయం పట్టుకుందని వైఎస్ షర్మిల విమర్శించారు. కేసీఆర్ కి వైఎస్ఆర్టీపీ ప్రత్యామ్నాయం అన్నారు.  తెలంగాణలో బలం పుంజుకుంది కాబట్టి ఇప్పుడు ఆపలేకపోతే ఎప్పుడూ ఆపలేం అని కేసీఆర్ కు  భయంపట్టుకుందన్నారు. ఇలా మమ్మల్ని ఆపాలని అనుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు మర్యాద ఉండాలన్నారు. కేసీఆర్ ఆ మర్యాదను కాపాడుకోవాలని హితవుపలికారు. పోలీసులను బీఆర్ఎస్ తొత్తుల్లా వాడుకోకండన్నారు. మమ్మల్ని అడ్డుకుంటే పోలీసులపై  కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రకారం మాకు హక్కులు ఉన్నాయన్నారు. తన హక్కులను కేసీఆర్ హరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఒక ఆఫ్ఘనిస్తాన్ లా తయారైందన్నారు. ఇక్కడ తాలిబాన్ పాలన కొనసాగుతుందన్నారు. ఈ తాలిబాన్ నాయకులకు అధ్యక్షుడు కేసీఆర్ అంటూ విమర్శలు చేశారు. 


పాదయాత్రకు హైకోర్టు అనుమతి


వరంగల్ జిల్లాలో పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ కోర్టును షర్మిల ఆశ్రయించారు.  పాదయాత్ర కి అనుమతిచ్చేలా వరంగల్ సీపీకి ఆదేశాలు ఇవ్వాలని షర్మిల పిటిషన్‌లో కోరారు.  పాదయాత్ర తో పాటు వరంగల్ బహిరంగ సభ కు అనుమతి కోరారు. కోర్ట్ అనుమతి ఇచ్చిన తర్వాత  పోలీసులు ఎలా అనుమతి నిరాకరిస్తారని విచారణలో హైకోర్టు ప్రశ్నించింది.  రాజకీయ నాయకులు అందరూ పాదయాత్ర కోసం  కోర్ట్ లు చుట్టూ  తిరుగుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది  తెలంగాణ ను తాలిబాన్ ల రాష్ట్రం గా మారుస్తున్నారని షర్మిల వాఖ్యనించారని..  కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా అభ్యంతకర వాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెల్లారు. అయితే రాజ్ భవన్ దగ్గర వాఖ్యలు చేస్తే పాదయాత్ర కు ఎందుకు అనుమతి నిరాకరించారని హై కోర్టు ప్రశ్నింంచింది.  హైకోర్టు అనుమతితో షర్మిల పాదయాత్ర పునంప్రారంభమానికి మార్గం సుగమం అయింది.