YS Sharmila : వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీలో విజయమ్మ షర్మిలకు తనసాయం అవసరం ఉందని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజీనామా వ్యవహారంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించేందుకు నిరాకరించారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్టీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్టీపీ జెండాను షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలు దాటవేశారు.
విజయమ్మ రాజీనామాపై
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి షర్మిల టార్గెట్ చేశారు. హైదరాబాద్ లో సెంటు భూమి కూడా లేదా? అని ఆమె ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకున్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన ప్రతి గడపను, ప్రతి గుండెను తాకిందన్నారు. వైఎస్సార్ బంగారు పాలనను ప్రజలు గుర్తించారన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వైఎస్ఆర్ సంక్షేమ పాలనను అందించారని షర్మిల అన్నారు. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వైఎస్ సేవలను విస్మరించాయని ఆరోపించారు. అయితే విలేకరుల విజయమ్మ రాజీనామా గురించి అడిగితే ఆమె స్పందించలేదు. అలాగే సీఎం జగన్ తో సంబంధాలపై స్పందించడానికి నిరాకరించారు.
తెలంగాణలో యాక్టివ్ అవుతున్న షర్మిల
గత ఏడాది జులై 8న వైఎస్ఆర్టీపీ వైఎస్ షర్మిల స్థాపించారు. తెలంగాణలో పార్టీ స్థాపించిన షర్మిల అప్పటి నుంచీ ప్రజల్లోకి వెళ్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ టార్గెట్ గా షర్మిల విమర్శలు చేస్తుంటారు. సీఎం కేసీఆర్ పై తరచూ స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నిరుద్యోగులు మద్దతుగా ఆమె నిరాహార దీక్షలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కోసం పరామర్శ యాత్ర చేశారు. 3500 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించి 116 రోజుల్లో 1500 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశారు.
వైసీపీకి విజయమ్మ రాజీనామా
వైసీపీ ప్లీనరీ సమావేశంలో సంచలన ప్రకటన చేశారు విజయలక్ష్మి. వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తోందని, ఆమెకు తాను అండగా నిలవాల్సి అవసరముందని వ్యాఖ్యానించారు. షర్మిలతో కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని, విమర్శలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయమని అన్నారు. తన జీవితంలో ప్రతి మలుపు ప్రజాజీవితాలతో ముడి పడి ఉందని వైఎస్ఆర్ చెబుతుండేవారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి తన వాడే కాదని...అందరివాడని వ్యాఖ్యానించారు. అండగా నిలుస్తున్న ప్రజల్ని అభినందించడానికి, ఆశీర్వదించటానికే వచ్చానని స్పష్టం చేశారు. అధికారం కోసమే రాజకీయ పార్టీలు పుడతాయన్న ఆమె, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే వైఎస్‌ఆర్ సీపీ పుట్టిందని స్పష్టం చేశారు.
Also read : YSRCP Plenary: వైసీపీకి రాజీనామా, ప్లీనరీలో విజయమ్మ సంచలన ప్రకటన
Also Read : YSRCP Internal Politics : ప్లీనరీలోనే గౌరవాధ్యక్షురాలి రాజీనామా ప్రకటనా ? షాక్‌లో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు !