YS Sharmila Padayatra : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వైఎస్ షర్మిల హైకోర్టు నిబంధనలు ధిక్కరించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇటీవల పాదయాత్ర సమయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను కోర్టుకు సమర్పించారు. అయితే పాదయాత్ర అనుమతి కోసం ఎన్నిసార్లు కోర్టుకు వస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైఎస్ షర్మిలను ఆదేశించింది కోర్టు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.  


పాదయాత్ర అనుమతి రద్దు 


వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు ఇటీవల(ఫిబ్రవరి 19) అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. అనంతరం షర్మిల పాదయాత్రకు అనుమతిని రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు.  ఫిబ్రవరి 18న మహబూబాబాద్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు.  ఇటీవల మహబూబాబాద్‌ MLA శంకర్‌నాయక్‌పై చేసిన హాట్‌ కామెంట్స్‌తో షర్మిల పాదయాత్రకు బ్రేక్‌పడింది. షర్మిల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. షర్మిల పాదయాత్ర బస శిబిరం దగ్గర BRS కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శంకర్‌నాయక్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  


వివాదాస్పద వ్యాఖ్యలు 


వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద గత ఏడాది నవంబర్ 28న షర్మిల అరెస్ట్‌తో పాదయాత్ర నిలిచిపోయింది. జనవరి 25న తిరిగి పాదయాత్ర నిర్వహించుకోవాడనికి వరంగల్ సీపీకి వైఎస్ఆర్టీపీ నేతలు దరఖాస్తు చేశారు. దీంతో  వైఎస్‌ షర్మిల పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. అయితే, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర చేసుకునేందుకు  ఆమెకు వరంగల్‌ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌ అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉంటే షరతులతో కూడిన అనుమతిని షర్మిల యాత్రకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పోయిన సంవత్సరం నవంబర్‌ 28వ తేదీన వరంగల్‌ జిల్లా లింగగిరి వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్, జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.  రోజు మొత్తం కాకుండా ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాదాస్పద వాఖ్యలు చేయవద్దని పోలీసులు చెప్పారు. ర్యాలీల సందర్భంగా బాణా సంచా లాంటివి ఎవరూ కాల్చవద్దని అన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదు అని పోలీసులు షరతులు పెట్టారు.  ఈ నిబంధనలు అతిక్రమించడంతో ఇటీవల పోలీసులు వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి రద్దు చేశారు.