YS Sharmila : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విమరించే ప్రసక్తి లేదని షర్మిల తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ షర్మిల దీక్ష చేస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై వైఎస్సార్టీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ ఆఫీస్ కు నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీస్ లు అడ్డుకుంటున్నారు. లోటస్ పాండ్ వద్ద కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది.
ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు
తన పాదయాత్రకు అనుమతి, అరెస్ట్ చేసిన పార్టీ నేతలను విడిచిపెట్టే వరకు మంచినీళ్లు కూడా ముట్టనని వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేపట్టారు. లోటస్ పాండ్ లో షర్మిల దీక్ష చేస్తున్న ప్రాంతం చుట్టూ పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. పార్టీ కార్యకర్తలను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటూ మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు కానీ ప్రజల పక్షాన పోరాడే వైఎస్సార్టీపీని మాత్రం కార్యక్రమాలు చేసుకోవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తన పాదయాత్రకు అనుమతి ఇచ్చినా కేసీఆర్ నియంతృత్వ పాలనలో న్యాయస్థానానికి, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు. తమ పార్టీ శ్రేణులను విడుదల చేసేంత వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని వైఎస్ షర్మిల తేల్చిచెప్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు.
పోలీసుల అదుపులో పార్టీ నేతలు!
ప్రభుత్వం దిగొచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్కక్తం చేశారు. బాధితుల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌టీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా తమ పార్టీ శ్రేణులను అరెస్టుచేస్తున్నారన్నారు. మరోవైపు వైఎస్సార్‌టీపీ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌లో 40 మంది పార్టీ ముఖ్య నేతలు, బంజారాహిల్స్ పీఎస్‌లో ఏడుగురు పార్టీ నేతలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.