Gold ATM : దేశంలోనే మొదటిసారి  గోల్డ్ ఏటీఎం ప్రారంభించడం, దానికి హైదరాబాద్ లో శ్రీకారం చుట్టడం పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బేగంపేట్ లోని అశోక రఘుపతి ఛాంబర్స్ లో శనివారం గోల్డ్ సిక్క ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన గోల్డ్ ఏటీఎంను సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు.  మారుతున్న సాంకేతిక నిపుణతలతో ప్రజల అవసరాలు అభిరుచుల మేరకు వ్యాపార దృక్పథం  కూడా మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తక్కువ పరిమాణంలో బంగారాన్ని కోనుగోలు కోసం బంగారం షాప్ కు వెళ్లాలంటే మోహమాటపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా  గృహిణీలకు తాము  దాచుకున్న డబ్బులతో నిర్మొహమాటంగా ఏటీఎం వద్దకు వచ్చి బంగారాన్ని తీసుకోవచ్చని వివరించారు. ఈ ఏటీఎంలో 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బంగారాన్ని తీసుకునే వెసులుబాటు ఉండడం సంతోషదాయకమని వెల్లడించారు. 



డెబిట్, క్రెడిట్ కార్డులతో డ్రా 


 దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను హైదరాబాద్‌ బేగంపేటలో ఏర్పాటుచేశారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో మనకు కావాల్సిన గోల్డ్ ను ఈ ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. అశోక్‌ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్‌ సిక్కా సంస్థ కార్యాలయంలో ఈ గోల్డ్ ఏటీఎంను ఏర్పాటుచేశారు. ఈ ఏటీఎం ద్వారా శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ వెల్లడించారు. గోల్డ్ నాణేలతో పాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పేపర్స్ కూడా జారీ అవుతాయని పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్ లోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తో పాటు పెద్దపల్లి, వరంగల్‌, కరీంనగర్‌లలో గోల్డ్‌ ఏటీఎంలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై డిస్ ప్లే అయ్యే విధంగా ఏర్పాటుచేశామన్నారు.