TSRTC Bus Pass : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ, గ్రూప్ 1 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. అయితే రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్‌లపై 20 శాతం రాయికీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెల లపాటు ఈ రాయితీ కొనసాగిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ బస్‌పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు ఆధార్ కార్డు జిరాక్స్, కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఐడీ కార్డు జిరాక్స్, నిరుద్యోగ గుర్తింపు కార్డులలో ఏదొకటి పాస్ తీసుకునే సమయంలో సబ్మిట్ చేయాలని తెలిపారు.
20 శాతం రాయితీ
టీఎస్ఆర్టీసీ మూడు నెలలకు ఆర్డినరీ బస్ పాస్ కోసం రూ.3,450 చెల్లించాలి. తాజా రాయితీతో ఈ ఛార్జీ రౌండప్ చేసి రూ.2,800గా నిర్ణయించారు. అలాగే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కు ప్రస్తుతం రూ.3,900 వసూలు చేస్తున్నారు. 20 శాతం రాయితీతో రౌండప్ చేసి రూ.3,200 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ నూతన కాల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. 040-23450033, 040-69440000 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ సర్వీసుల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. కాల్ సెంటర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. రిజర్వేషన్, బస్సుల వివరాలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని టీఎస్ఆర్టీసీ తెలిపింది.