Etela Rajender : ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఉన్నారు కాబట్టి లెక్కలు అన్ని పక్కన పెట్టి తెలంగాణ ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ... చాలామంది మా దృష్టికి అనేక సమస్యలు తీసుకువస్తున్నారని వాటికి పరిష్కారం అందించాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నానన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనకు అపారమైన అనుభవం ఉందన్నారు. ఒక్కటి సత్యం కేంద్ర ప్రభుత్వం ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక రూపాయి కూడా అటు ఇటు ఉండే ఆస్కారం లేదన్నారు. ఐదు సంవత్సరాల పాటు ఆర్థికమంత్రిగా కేంద్రం దగ్గరికి అనేక దరఖాస్తులు పట్టుకొనిపోయానన్నారు. ఎక్కడ కూడా రూ.100 కోట్లు కూడా ఇచ్చే ఆస్కారం లేదన్నారు. మనం బడ్జెట్లో పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోసం మనకు ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదన్నారు. కేంద్రమంత్రిగా కేసీఆర్ పనిచేసిన అనుభవజ్ఞులు కాబట్టి ఈ విషయం చెప్తున్నానన్నారు.
ఎస్సారెస్పీపై క్లారిటీ ఇవ్వాలి
"ఉమ్మడి రాష్ట్రంలో 45 రోజులు బడ్జెట్ సమావేశాలు జరిగేవి. ముఖ్యమంత్రి కూడా ఎన్ని రోజులైనా సభ జరపండి. ప్రజాసమస్యల పరిష్కారానికి మంచి వేదిక అసెంబ్లీ. మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉంటారని ఆయనే చెప్పారు కాబట్టి. ఇంకా కొద్దిరోజులు పొడిగించి చర్చలు జరిగితే బాగుంటుంది భావిస్తున్నాను. ముఖ్యమంత్రి నా బతుకంతా తెలంగాణది అని 25 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రయోజనం కోసం ఇతర రాష్ట్రాలు ఏం మాట్లాడినా ఉపేక్షించేవారు కాదు. కానీ బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత అవసరమైతే ఎస్సారెస్పీ నుంచి.. ఆ పైనుంచి నది నుంచి నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు కనిపిస్తామని చెప్తున్నారు. దాని వల్ల ఉత్తర తెలంగాణలో రైతాంగం ఆందోళన పడుతున్నారు. కాబట్టి ఆయన చెప్పినదేంటి? పత్రికలు రాసింది ఏంటి? కేసీఆర్ క్లారిఫై చేస్తారని భావిస్తున్నాను. ఒకనాడు బాబ్లీ మీద అనేక గొడవలు జరిగాయి. బాబ్లీ నుంచి మనవరకు 12 ప్రాజెక్టులకు పెడితే ఎన్ని గొడవలు పెట్టామో మనకు తెలుసు. గోదావరి నుంచి సంపూర్ణ నీళ్లు రాకపోతే కాళేశ్వరం నుంచి రివర్స్ పంపిన ద్వారా జగిత్యాల మెట్పల్లి వరకు నీళ్లను ఇచ్చుకునే అవకాశం కోల్పోతాం. రెండు లిఫ్టులు కూడా పెట్టుకున్నాం దయచేసి దానిమీద క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాను." - ఈటల రాజేందర్
కోతకు గురవుతున్న భూములు
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు అనేక భూములు సేకరణ చేసుకున్నామని, గోదావరికి వచ్చిన వరదల వల్ల కనీవిని ఎరుగని రీతిలో భూములు కోతకు గురయ్యాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వీణవంకలో.. మానేరు వాగులో భూములు కొట్టుకుపోయాయన్నారు. ఆ విధంగా కొట్టుకుపోయిన భూములను సర్వే చేయించి వారికి పరిహారం అందించాలని కోరారు. కట్టలు వేసినప్పటికీ మూడు ప్రాజెక్టుల వల్ల ఊటకు గురై వందల ఎకరాల భూములు మునుగుతున్నాయన్నారు. కాబట్టి వారికి శాశ్వతంగా అక్వైర్ చేసుకోవాలన్నారు. బాల్కసుమన్ చెప్పినట్లుగా వరదలు వచ్చినప్పుడు మునిగే పంట పొలాలు వేల ఎకరాలు ఉండవచ్చని, కానీ మామూలు వరద వచ్చినప్పుడు కూడా కొన్ని భూములు మునుగుతున్నాయన్నారు. ఆ ప్రాజెక్టులో పని చేసే ఇంజినీర్లు కొంత భూమిని మార్కింగ్ చేశారు కాబట్టి.. ప్రాజెక్ట్ రెండు వైపులా పేదవారు ఉన్నారని, వారికి పరిహారం అందించాలని కోరారు.
రైతు రుణమాఫీ ఇంకెప్పుడు?
"మహిళా సంఘాలలో 70 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. 2018లో వడ్డీ లేని రుణాలు కింద డబ్బులు పే చేశాం. అప్పటి నుంచి వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఏ మహిళలైతే లక్షాధికారులు కావాలని కోరుకున్నాం.. వారికి రావాల్సిన వడ్డీ లేని రుణాల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీవోఏలకు 3900 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పక్క రాష్ట్రంలో కూడా పదివేల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మనం కూడా మానవతా దృక్పథంతో వీవోఏలకు జీతభత్యాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని జీతభత్యాలు పెంచాలి. కాలేజీల్లో, స్కూళ్లలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న వారికి ఆగస్టు, సెప్టెంబర్లో రెన్యువల్ చేయటం వల్ల సంవత్సరానికి 8 నెలల జీతం మాత్రమే వస్తుంది. కాబట్టి 12 నెలల జీతం వచ్చే విధంగా ఆటో రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సింగరేణి గురించి సీఎం క్లారిఫై చెయ్యాలని కోరుతున్నాను. సింగరేణి ప్రైవేట్ పరం కావాలని ఎవరు కోరుకోరు. 51 శాతం మన మాటనే ఉంటుంది. నాకు తెలిసిన చరిత్రలో కేంద్రం ఇన్వాల్వ్ అయి చేసేది లేదు. మొత్తంగా పాలసీలు, వాటాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి కార్మిక వర్గానికి అపోహలు తీర్చాలని కోరుతున్నాను. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగేండ్లు అవుతుంది. 25 నుంచి 50 వేల రూపాయల వరకు ఇచ్చారు. మిగతా వారికి కూడా చెయ్యాలని కోరుతున్నాను." - ఈటల రాజేందర్