Revanth Reddy : అక్టోబర్ 24న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4న దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ తెలంగాణలో పర్యటనకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తారన్నారు. తెలంగాణ ఆకాంక్షలు, సమస్యలపై రాహుల్ గాంధీ ఈ యాత్రలో మాట్లాడనున్నారని తెలిపారు. 14 రోజుల జోడో యాత్ర రూట్ మ్యాప్ పై సూత్రప్రాయంగా నిర్ణయించామన్న రేవంత్ రెడ్డి, యాత్ర సెక్యూరిటీకి సంబంధించి రేపు డీజీపీని కలుస్తామన్నారు. తుది రూట్ మ్యాప్ ను ఏఐసీసీ నేతల సమీక్ష తరువాత నిర్ణయిస్తామని వెల్లడించారు. భారత్ జోడో యాత్ర ఎన్నికల యాత్ర కాదని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడుకునేందుకు చేస్తున్న బృహత్తర యాత్ర అన్నారు.
కేటీఆర్ చెప్పేవి ఊకదంపుడు ఉపన్యాసాలు
దేశ ప్రయోజనాల కోసం ఈ యాత్రలో పార్టీలకు అతీతంగా పాల్గొనాలి. దేశాన్ని ఒక బలమైన దేశంగా నిలబెట్టేందుకు కలిసి రావాలని కోరుతున్నాం. అక్టోబర్ 2 గాంధీ జయంతిని బోయిన్ పల్లిలో నిర్వహించనున్నాం. సాగర హారం, సకలజనుల సమ్మె టీఆర్ఎస్ ఒక్కటే చేయలేదు. కాంగ్రెస్ నేతృత్వం వహించినపుడు జరిగినవే. నేను ఉద్యమంలో ఎక్కడున్నానో నా శాసనసభ రికార్డ్స్ చూస్తే తెలుస్తుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కేటీఆర్ చేసిందేం లేదు. 610 జీవో అమలు చేస్తే కేటీఆర్ చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరారు. ఆయన రెండు అని నాలుగు తన్నించుకునే రకం. ఈ అంశంపై ఎలాంటి చర్చకైనా సిద్ధం -రేవంత్
మెట్రో రైల్ కు జైపాల్ రెడ్డి పేరు
హైదరాబాద్ కు మణిహారమైన మెట్రో రైల్ కు స్వర్గీయ జైపాల్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ కు మెట్రో రైలు మాంజూరు చేశారని గుర్తుచేశారు. ఇందుకోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అరుదని, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు జైపాల్ రెడ్డి అని ఆయన కొనియాడారు. దిల్లీకి వెళ్లినా ఆయన ఈ ప్రాంత సమస్యల విషయంలో రాజీపడలేదన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని మొట్టమొదట కృషి చేసింది జైపాల్ రెడ్డి అని తెలిపారు. డెబ్బయ్యో దశకంలోనే మారుమూల పల్లెలకు కరెంటును తీసుకొచ్చి పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన వ్యక్తి అని ఆయన చెప్పారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత
ఎవరినీ విమర్శించకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమని, అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత జైపాల్ రెడ్డిదని రేవంత్ అన్నారు. అలాంటి ఆయనకు తాము బంధువులమని తేలిపారు. తాము ఆయన రాజకీయ వారసులం కాదని పార్టీలకు అతీతంగా ఆయనకు రాజకీయ వారసులు ఉన్నారని తెలిపారు. ఆయన ఎంతో మంది నాయకులను తయారు చేశారన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో దివంగత ప్రధాని పీవీ విగ్రహం ఏర్పాటు చేసినట్లే. చివరి వరకు రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన నాయకుడి జైపాల్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.