Minister Jogi Ramesh : వైఎస్ఆర్‌సీపీ కూడా ఆ పీఎఫ్‌ఐ లాంటి విధ్వంసకర పార్టీ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. సత్య కుమార్ వైసీపీపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సత్య కుమార్ అసత్య కుమార్ గా మారి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  మరెవరికో రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నార‌ని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స‌త్యకుమార్ బీజేపీకి చెందిన కార్యదర్శిగా కాకుండా, బీడీపీకి చెందిన కార్యదర్శిలా మాట్లాడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నేర్చుకోవాలని మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. 


ఏపీని చూసి నేర్చుకోవాలి


"ఏపీలో ఏదో జరిగిపోతున్నట్లు, పేర్లన్నీ మార్చేస్తున్నట్లు సత్య కుమార్ మాట్లాడుతున్నారు. సత్యకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఇతను బీజేపీ జాతీయ కార్యదర్శిలా లేరు. దిల్లీలో ఎక్కడా ప్రెస్ మీట్స్ పెట్టినట్లు కనిపించలేదు. ఏపీకి వచ్చారు ఏదో మాట్లాడుతుంటారు. సత్యకుమార్ బీజేపీ కార్యదర్శా లేక బీడీపీకి కార్యదర్శా? మీ చరిత్ర తెలుసు, మీ వెనుకున్న మాట్లాడించేవాళ్ల చరిత్ర తెలుసు. మేం మాత్రం బయటకు లాగితే మొత్తం కూడా లోపలికివెళ్లిపోయారు. దేశంలోని 28 రాష్ట్రాలున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బటన్ నొక్కగానే సంక్షేమ ఫలాలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో పడేటట్లు ఉన్నాయా? ప్రతి ఒక్కరిగా సంక్షేమ ఫలాలు అందించేలా బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఏపీని చూసి బీజేపీ పాలిత రాష్ట్రాలు నేర్చుకోవాలి. ఏపీలో జరుగుతుంది అభివృద్ధి అవినీతి కాదు. ఇక్కడ సీఎం టు కామన్ మ్యాన్. ఎక్కడా అవినీతి లేదు. సంక్షేమ పథకాలపై అసత్యాలు మాట్లాడుతున్నారు. సత్యదూరమైన మాట్లాడుతున్న సత్యకుమార్ వెనకాల ఎవరున్నారో వాళ్ల బాగోతం మాకు తెలుసు. ఇలాంటి వెకిలి వ్యాఖ్యలు చేయొద్దు, ఒళ్లు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను." -  మంత్రి జోగి రమేష్ 


 వైఎస్ఆర్‌సీపీ, పీఎఫ్ఐ రెండూ ఒక్కటే- సత్యకుమార్ 


 దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రలు చేస్తోందన్న కారణంగా కేంద్రం నిషేధం విధించింది. అయితే ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ కూడా ఆ పీఎఫ్‌ఐ లాంటి విధ్వంసకర పార్టీనే అని బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ ఆరోపించారు. పీఎఫ్ఐ లాంటి ప్రమాదకర పార్టీ వైఎస్ఆర్‌సీపీ అని ఆరోపించారు. ఓ ఉగ్రవాద సంస్తతో వైఎస్ఆర్‌సీపీని అదీ కూడా బీజేపీ జాతీయ స్థాయి నేత పోల్చడం చర్చనీయాంశమవుతోంది.  వైఎస్ఆర్‌సీపీ, పీఎఫ్ఐ రెండింటివీ విధ్వంసకర ఆలోచనలేనని సత్యకుమార్ చెబుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని ఇస్తున్న గరీబ్ కల్యాణ్ యోచన పథకం బియ్యాన్ని ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఏపీలో విధ్వంసకర పాలన చేస్తున్న వైఎస్ఆర్‌సీపీని ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెబుతున్నారు. గడప గడపకూ వెళ్తున్న అధికార పార్టీ నాయకుల్ని ప్రజలు నిలదీస్తున్నారని..  ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఎందుకు ఉందో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలన సత్యకుమార్ సలహా ఇచ్చారు.  గృహ నిర్మాణంపై సీఎం ఎన్నిసార్లు సమీక్షించినా పురోగతి లేదని..రాష్ట్రంలో 10 శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు.  విశాఖలో సీఎం ఇళ్లు కడితే విశాఖ అభివృద్ధి అవుతుందా  అని ప్రశ్నించారు.