Etela Rajender On Budget : ఆర్థిక మంత్రి హరీశ్ రావు 29 పేజీలో బడ్జెట్ పుస్తకాన్ని గంట నలభై ఐదు నిమిషాలు చదివారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యంగ్యంగా ప్రస్తావించారు. తనకున్న అనుభవం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 50 శాతం నిధులు కూడా విడుదల కావడం లేదన్నారు. కొన్ని డిపార్ట్మెంట్స్ కి ముఖ్యంగా సంక్షేమశాఖలకు డబ్బులు విడుదల చేయకుండా మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ , తనకు కొన్ని వందల దరఖాస్తులు వస్తున్నాయని, రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో పెట్టి నాలుగున్నర సంవత్సరాలు అయినా మాఫీ చెయ్యలేదని విమర్శించారు. ఈ బడ్జెట్ లో రుణమాఫీ ప్రస్తావన చెయ్యలేదన్నారు. ఉద్యోగులకు జీతం ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. SERP, VOA లకు జీతాలు పెంచలేదన్నారు. తెలంగాణలో వీళ్లకు రూ. 3900 ఇస్తుంటే, పక్కన ఉన్న ఏపీలో రూ.10 వేలు ఇస్తున్నారన్నారు. అంగన్ వాడీలకు రూ.1000 ఇస్తున్నారని, ఇప్పుడు 3000 ఇస్తాం అంటున్నారని, ఇదైనా సక్రమంగా ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.  తెలంగాణ బడ్జెట్  అంకెల గారడి అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రుణమాఫీ చెయ్యాలని రైతులు కోరుతున్నారని, ఆ హామీ నెరవేరేదెప్పుడు అని ప్రశ్నించారు.  


ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ డబ్బులు ఇవ్వడంలేదు


"కేసీఆర్ కిట్ పిల్లలు పుట్టాక ఇస్తున్నారు. రెసిడెన్షియల్  స్కూల్స్ లో క్లాస్ రూంలు తప్ప మౌలిక సదుపాయాలు మెరుగులేదు. ఎల్బీ నగర్ లో వీఎం హోంలో టాయిలెట్ లేక చెంబు పట్టుకొని బయటకి వెళ్తున్నారు అని పత్రికల్లో వార్తలు రావడం బాధాకరం. ఆరోగ్య శ్రీ, EHS డబ్బులు రాక ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందడం లేదు. కాంట్రాక్టర్స్ కి డబ్బులు లేవు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ఘనత ఒక్క తెలంగాణలోనే ఉంది. రిటైర్డ్ ఉద్యోగులు పిల్లల పెళ్లిళ్ల కోసం పెట్టుకున్న జీపీఎఫ్ ఇవ్వడం లేదు. గొప్ప అభివృద్ధి అని చెప్తున్న మీరు బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు వల్ల ఎంత ఆదాయం పెరిగిందో కూడా చెప్పాల్సింది. మీ ఆదాయం దీనితోనే కదా పెరిగింది. కాంట్రాక్టర్స్ కి డబ్బులు సమయానికి ఇవ్వండి. సర్పంచ్ లకు బిల్లులు చెల్లించండి. జీతాలు మొదటి తారీఖున ఇవ్వండి. మీ బడ్జెట్ విని ప్రజలు ముక్కు విరుస్తున్నారు. చెప్పేది గొప్ప.. చేసేది సున్నా" - ఈటల రాజేందర్  


కాంట్రాక్టర్లకు బిల్లులు రాక ఆత్మహత్యలు 


బాసర ట్రిపుల్ ఐటీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురుకులలో సరైన వసతులు లేవని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మన ఊరు-మన బడి కేవలం చెప్పడానికే రంగురంగులుగా కనిపిస్తుందన్నారు. ఈహెచ్ఎస్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వలేమంటున్నారన్నారు. ఆసుపత్రిలలో మందులు కూడా అందడం లేదని విమర్శించారు. విద్యా వాలంటరీలకు, విదేశీ విద్యకు వెళ్లే వారికి సరైన సమయానికి డబ్బు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్‌లకు టైంకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు.