AP Telangana Breaking Live: ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1435 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 69,173 నిర్థారణ పరీక్షలు చేశారు. ఇందులో 1435 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

ABP Desam Last Updated: 20 Aug 2021 04:39 PM
ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు


ఏపీలో గడిచిన 24 గంటల్లో 1435 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 69,173 నిర్థారణ పరీక్షలు చేశారు. ఇందులో 1435 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ వల్ల చిత్తూరు ఇద్దరు, కృష్ణలో ఇద్దరు ప్రకాశంలో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 1,695 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,72,539 సాంపిల్స్  పరీక్షించారు. 

ఏపీలో రాత్రి కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు....

ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4 తేదీ వరకూ రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. 

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభించిన సీజేఐ

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఆర్బిట్రేషన్‌ కేంద్రం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వం చేస్తుంటారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ఈ ఆర్బిట్రేషన్‌ కేంద్రం వేదికగా మారనుంది.

విజయనగరం జిల్లాలో దారుణం.. యువతిపై అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. తాను వివాహం చేసుకోవాల్సిన యువతిపై అనుమానంతో ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడువాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి అక్కకు, ఆమె కుమారుడికి సైతం కాలిన గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘన నివాళి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీ గౌడ్ , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితర నేతలు గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ జయంతి.. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతల నివాళి

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ 77వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎంపీ  రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​, అధిర్​ రంజన్​ చౌదరీ నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నేతలు రాజీవ్ గాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని స్మరించుకున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి స్పైస్ జెట్ విమాన సర్వీసులు బంద్

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి అక్టోబర్​ వరకు స్పైస్‌ జెట్‌ విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలకు సంబంధించి టిక్కెట్ల విక్రయాలను ఆన్‌లైన్‌లో ఇదివరకే ఆపేశారు. కొన్ని కారణాలతో తాము అక్టోబర్ నెల వరకు సేవలను రద్దు చేస్తున్నట్లు స్పైస్‌ జెట్‌ సంస్థ ప్రకటించింది. 

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీకి షాక్.. కీలక నేత ఇందిరాశోభన్ రాజీనామా

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీకి షాక్ తగిలింది. పార్టీకి కీలక నేత ఇందిరాశోభన్ రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. త్వరలోనే తన రాజకీయ కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. మరోవైపు తెలంగాణ నిరుద్యోగ సమస్యలపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరాట దీక్షలు చేస్తున్నారు.

విజయవాడలో యువ పారిశ్రామికవేత్త దారుణ హత్య.. నలుగురిపై పోలీసుల అనుమానం

విజయవాడలో యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్(29) హత్యకు గురయ్యాడు. నగరం నడిబొడ్డున కారులోనే మృతదేహం కనిపించింది. వ్యాపార లావాదేవీల్లో వివాదాలు రావడంతో హత్యకు దారితీసి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో నలుగురి హస్తం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీని నాలుగేళ్ల కిందట రాహుల్ స్థాపించాడని తెలిసిందే.

Background

సూర్యాపేట పట్టణంలో కేంద్ర మంత్రి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమైంది. ఇవాళ (ఆగస్టు 20) ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోకి ఆయన యాత్ర ప్రవేశించనుంది. గతేడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర ణరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి జి.కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన చింతలచెరువుకు చెందిన మెరుగు మారతమ్మ నివాసంలో కిషన్ రెడ్డి అల్పాహారం తీసుకొనున్నారు. కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర.. తొలి రోజు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలిరోజు కోదాడ, సూర్యాపేటలో సాగిన యాత్రలో కేంద్ర సంక్షేమ పథకాలను కిషన్ రెడ్డి ప్రజలకు వివరించారు. కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తొలిరోజు యాత్రను ముగించుకున్న కిషన్‌రెడ్డి సూర్యాపేటలోనే బస చేశారు. 


Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.