SI Constable Candidates : హైదరాబాద్ అంబర్ పేట్ పోలీస్ గ్రౌండ్స్ వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాలతో రీ మెజర్మెంట్స్ కోసం అభ్యర్థులను అంబర్ పేట్ గ్రౌండ్స్ కు పిలిపించారు అధికారులు. అయితే డిజిటల్ మీటర్ ఉపయోగించి గతంలో వచ్చిన హైట్ ను తక్కువ చేసి చూపించి డిస్ క్వాలిఫై చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపించారు. గతంలో వచ్చిన హైట్ కన్నా రీ మేజర్మెంట్‭లో తక్కువగా చూపించారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మ్యాన్యువల్‭గా హైట్ తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా డిజిటల్ మీటర్ తో చెక్ చేశారని ఆరోపించారు. డిజిటల్ మీటర్ తో చెక్ చేసి డిస్ క్వాలిఫై చేస్తున్నారని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు మండిపడ్డారు. తమను  మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగం కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


గర్భిణీలు, బాలింతలకు మరో అవకాశం 


ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు తెలంగాణ పోలీసు నియామక మండలి మరో అవకాశం కల్పించింది. ప్రిలిమ్స్ లో అర్హత పొందిన వారు మెయిన్స్‌లో అర్హత పొందాక ఫిజిలక్ పరీక్షల్లో పాల్గొనవచ్చని మినహాయింపు ఇచ్చింది.  అయితే ఇందులో పాల్గొనాలంటే మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాలని తెలిపింది. ఫిబ్రవరి 28లోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.


ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ 


తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రాథమిక రాత పరీక్షల్లో పలు ప్రశ్నలకు మార్కులు కలపడంతో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిబ్రవరి 15 నుంచి పీఈటీ, పీఎంటీ నిర్వహిస్తున్నారు. ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట డిసెంబరు 8 నుంచి 31 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. కనిష్ఠంగా 9 రోజులు, గరిష్ఠంగా 24 రోజులపాటు వీటిని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు సిద్దిపేటలో ఇవి జరిగాయి. అప్పటికే ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07లక్షల మందికి అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మాత్రం కొన్ని కేంద్రాల్ని తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఏర్పాట్లు చేసింది. 


 హైకోర్టు ఆదేశాలతో 52 వేల మంది ఉత్తీర్ణత 


టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ గతేడాది ఆగస్టులో 16,875 పోస్టుల కోసం నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్షలకు సుమారు 8.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే 60 మార్కులు రావాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో 8 తప్పులు దొర్లాయి. వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించి అందుకు అనుగుణంగానే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఫలితాల్ని విడుదల చేసింది. అప్పట్లో 2.07లక్షల మంది అర్హులుగా తేలడంతో వారికి శారీరక సామర్థ్య పరీక్షల్ని నిర్వహించి తుది రాతపరీక్షలకు ఎంపిక చేసింది. మార్చిలో ఆ పరీక్షలను జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రాథమిక రాతపరీక్షలో తప్పులుగా దొర్లిన ప్రశ్నలను తొలగించకుండా వాటికీ మార్కుల్ని కలపాలనే డిమాండ్ మొదలైంది. ఇదే విషయమై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన న్యాయస్థానం మార్కుల్ని కలపాలంటూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 8 మార్కుల్ని కలపడంతో తాజాగా 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు.