Ysrcp Vs BJP : శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల శివుడికి సీఎం జగన్ పాలు తాగిస్తున్న కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫొటోను  వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. ఆ ట్వీ్ట్ లో తప్పేముందుని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో మాట్లాడిన ఆయన బీజేపీ రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. ఈ ఫొటోతో ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఏపీలో బీజేపీకి ఛాన్స్ లేదు. బీజేపీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ నేతల ఆలోచన అని మంత్రి బొత్స విమర్శించారు. ముఖ్యమంత్రి అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వర ఆరాధన అని వైసీపీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారని తెలిపారు. ఈశ్వరుని  ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇలా శుభాకాంక్షలు తెలిపారన్నారు. వైసీపీ శివరాత్రి శుభాకాంక్షలు ట్వీ ట్ చేస్తే బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఏ రకంగా దిగజారి పోయిందో ఈ విషయంలో అర్థం అవుతుందన్నారు. మనం అందరం హిందువులమే మన మనోభావాలకు కలగని నష్టం బీజేపీ ఎంపీలకు ఎలా నష్టం కలిగించాయో అని బొత్స ప్రశ్నించారు. 


బీజేపీ మత రాజకీయాలు ఏపీలో చెల్లవు 


 బీజేపీ నేతలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవసేవే మాధవసేవ అనేది బీజేపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. పేదలకు సాయం చేస్తే దేవుడికి సాయం చేసినట్టే అవుతుందని బీజేపీ నేతలు తెలుసుకోవాలన్నారు. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టే ఆలోచన బీజేపీ మానుకోవాలన్నారు. టీడీపీ పాలనలో 40 ఆలయాలను కూలిస్తే బీజేపీ ఏంచేసిందని ప్రశ్నించారు. చంద్రబాబు కూల్చిన ఆలయాలను వైసీపీ ప్రభుత్వం పునర్మిర్తిస్తుందన్నారు. బీజేపీ మత రాజకీయాలు ఏపీలో చెల్లవని ఘాటుగా వ్యాఖ్యానించారు. శివాలయాల వద్ద బీజేపీ డ్రామాలను ప్రజలు నమ్మరని వెల్లంపల్లి విమర్శలు చేశారు. 


వైసీపీ ట్వీట్ 


మహా శివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో శుభాకాంక్షలు తెలిపిన తీరు వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏపీ బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బాల శివుడికి సీఎం వైఎస్ జగన్ పాలు తాగిస్తున్న కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫోటో ఒకటి ట్విటర్ లో వైఎస్ఆర్ సీపీ విడుదల చేసింది. దీనిపై మహా శివరాత్రి నాడు అపచారం అంటూ బీజేపీ రంగంలోకి దిగింది. ఆ ఫోటో ట్వీట్‌ చేసి ‘‘అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధన. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో శనివారం నాడు (ఫిబ్రవరి 18) అధికారికంగా ట్వీట్ చేసింది.


సోము వీర్రాజు ఫైర్ 
 
వైఎస్ఆర్ సీపీ తెలిపిన ఈ తీరు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ఆ ఫోటోలో వైఎస్ జగన్ పాలు తాగిస్తున్న బాలుడు శివుడి తరహాలో పులి చర్మం ధరించి, చేతిలో ఢమరుకం, నుదుటన నామాలతో ఉండగా దాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. ఈ ఫోటోపై ఆయన ట్విటర్ ద్వారానే స్పందిస్తూ.. ‘‘పేద వాళ్ళు అని పేర్కొంటూనే చేతిలో ఢమరుకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం మరియు హిందువుల మనోభావాల పట్ల వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం యొక్క చులకన భావానికి ప్రతీక, ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ హైందవ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్ సీపీని డిమాండ్ చేస్తున్నాను’’ అని సోము వీర్రాజు తన సొంత ట్విటర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. దీనికి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను, వైఎస్ఆర్ సీపీ అధికారిక ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు.