ట్రు-అప్ ఛార్జీలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పీక్ అవర్ ఛార్జీలు పెంచే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పేదోడిపై భారాన్ని ఒప్పుకునే సవాలే లేదని ప్రకటించారు. రూ. 12వేల కోట్ల భారాన్ని మోసేందుకు కేసీఆర్ సిద్ధంగా వున్నారని మంత్రి తెలిపారు. విద్యుత్ పీక్ డిమాండ్ సమయంలో 20% చార్జీలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. కేంద్రం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమే అన్నారు. అలా చేస్తే సామాన్యుడిని విద్యుత్ వినియోగం నుంచి దూరం చెయ్యడమేనని మండిపడ్డారు. పేదోడిపై పడే ఏ భారాన్ని ఒప్పుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ట్రూ అప్ చార్జీల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమన్నారు. ట్రూ అప్ చార్జీలు పెంచాలి అంటూ ఈఆర్సీ సిఫారసు చేసినా పట్టించుకోకుండా రూ.12,000 కోట్ల అదనపు భారాన్ని భరించి, సామాన్యుడి మీద భారం పడకుండా చూసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.
పీక్ డిమాండ్ అంటే ఏంటి?
సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు! తిరిగి ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు కరెంటును వాడుకునే టైంనే పీక్ అవర్ డిమాండ్ అంటారు. ఈ సమయంలో సాధారణంగా కరెంటు వాడకం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఈ టైంలోనే వినియోగదారులపై భారం మోపుతామంటూ కేంద్రప్రభుత్వం తాఖీదులు జారీచేస్తే, భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదని మంత్రి స్పష్టం చేశారు. పీక్ డిమాండ్ లో 20% పెంచడమంటే అటు గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామికరంగంపై మోయలేని భారం మోపినట్లు అవుతుందన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ మాయమాటలు చెప్పి, ఇప్పుడు విద్యుత్ వినియోగం నుండి సామాన్యుడిని దూరం చేసే కుట్రలకు తెర లేపారన్నారు. 2014కు ముందున్న ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయా వ్యాపారం చేస్తున్నాయా అంటూ అప్పటి ప్రభుత్వాలను తూలనాడి అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇప్పుడు తాను అదే చేస్తున్నారన నిరూపించారన్నారు.
విద్యుత్ జీవితంలో బాగమైందని, విద్యుత్ వినియోగించకుండా ఉండలేని పరిస్థితులు ఉత్పన్బమైనాయని మంత్రి తెలిపారు. అటువంటి పరిస్థితులలో పేద ప్రజలకు ఇచ్చే సబ్సీడీలు ఎత్తివేసే చర్యలకు బిజెపి ప్రభుత్వం రూట్ మ్యాప్ రెడీ చేసిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. బాయకాడ మోటర్లకు మీటర్ పెట్టాలన్న కేంద్రప్రభుత్వ సిఫార్సులను పక్కన పడేసినందుకు మోదీ సర్కారు తెలంగాణపై కక్ష తీర్చుకుంటోందని మంత్రి విమర్శించారు. అందుకే FRBM పరిమితి కింద రావాల్సిన అప్పులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పేదల పక్షంగానే ఉంటుందన్నారు. పీక్ డిమాండ్ సమయంలో 20% చార్జీలు పెంచాలన్న కేంద్రప్రభుత్వ సిఫారసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు. జేబులకు చిల్లులు పెట్టడం...ప్రజలను చీకట్లోకి నెట్టడమే కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వ ఆలోచన అని ఆయన విమర్శించారు. అటువంటి దుర్మార్గాలకు చెల్లుచీటి పాడి మోదీ పాలనకు చరమగీతం పాడే రోజులు ఎంతోదూరంలో లేవని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.