Mla Raja Singh : హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. గతేడాది ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు అయింది. ఈ కేసును కంచన్‌బాగ్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు బదిలీచేశారు. దీంతో మంగళ్‌హాట్ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
వివాదాస్పద వీడియో
హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడియన్ షో అనుమతి రద్దు చేయాలని రాజాసింగ్ పోరాటం చేశారు. ఆయన హిందువుల్ని కించ పరిచారని ఆరోపించారు. అయితే షో యధావిధిగా నడిచింది. దానికి కౌంటర్‌గా రాజాసింగ్.. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమయింది. పోలీసులు మొదట కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే కోర్టు రిమాండ్‌కు పంపకుండానే బెయిల్ ఇచ్చింది. తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. గత ఏడాది ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. అనంతరం ఆయను జైలు తరలించారు. పీడీ యాక్ట్‌పై తన భర్తను అక్రమంగా జైల్లో నిర్బంధించారని రాజాసింగ్ భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై పీడీ యాక్ట్‌ను క్వాష్ చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే పలు రకాల షరతులను విధించింది. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది.
ఆగస్టులో కేసు
అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ పై గతేడాది ఆగస్టులో కేసు నమోదైంది. అయితే ఈ అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద తాజాగా రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. అంతకు ముందు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు పంపించిన విషయం తెలిసిందే. రాజాసింగ్ కు కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
బీజేపీ నోటీసులకు గతంలో వివరణ
మునావర్ ఫారుఖీని ఇమిటేట్ మాత్రమే చేశానని.. ఏ మతాన్ని, వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ అధిష్ఠానానికి అప్పట్లో రాజాసింగ్ వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. ఎంఐఎం విధానాలను ప్రశ్నిస్తే ముస్లింలను తిడుతున్నట్లుగా వక్రీకరిస్తున్నారని.. తనపై వందకు పైగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు 5 వందల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని తెలిపారు. తానెక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని.. పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ డిసిప్లినరీ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలన్న విధంగానే తాను పోరాడుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తనపైన వంద కేసులు పెట్టారన్నారు. షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న విధంగా తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని .. క్రమిశిక్షణా చర్యలు తీసుకోవాల్సినంత తప్పు తానేమీ చేయలేదన్నారు.