బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని అంటారు. కానీ దాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకు కారణం వాటికి ఉండే జిగట లక్షణం. కూర వండేటప్పుడు, కోసేటప్పుడు కూడా జిగట తీగలు తీగలుగా కనిపిస్తూ చూసేందుకు కూడా కంటికి నచ్చదు. ఆ జిగురు కారణంగానే ఎక్కువ మంది దీన్ని పక్కన పెట్టేస్తారు. ఇలా చేశారంటే బెండకాయ కూర లేదా ఫ్రై ఏదైనా జిగట లేకుండా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసా? జస్ట్ సింపుల్ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం లేదా పెరుగు వేసి ఫ్రై చేసుకోండి. అలా చేశారంటే కూర జిగట లేకుండా క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇవే కాదు మరికొన్ని వంటింటి చిట్కాలు మీ కోసం..
కొత్త గిన్నెల స్టిక్కర్స్ ఇలా పోగొట్టండి
ఇంట్లో ఏదైనా స్టీల్ లేదా ఇతర పాత్రలు కొనుగోలు చేసినప్పుడు వాటి మీద ఖచ్చితంగా స్టిక్కర్స్ ఉంటాయి. వాటిని మామూలుగా పీకేస్తే సగం సగం మాత్రమే వస్తాయి. ఒక్కోసారి స్టిక్కర్ పూర్తిగా వచ్చిన దానికి ఉన్న బంక మాత్రం గిన్నెలకు అలాగే అతుక్కుపోయి ఉంటుంది. వాటిలో ఏదైనా వంట చేసినా సబ్బుతో కడిగినా అవి ఆ గమ్ మీద అతుక్కుని ఉండిపోతాయి. అలా జరగకుండా స్టిక్కర్స్ ఈజీగా ఇలా తీసేయండి. స్టిక్కర్ ఉన్న వైపు గిన్నె స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. ఇలా చేశారంటే స్టిక్కర్ సులువుగా ఊడిపోతుంది. దాని గమ్ కూడా పూర్తిగా తొలగిపోతుంది.
ఉప్పు షేకర్ లో బియ్యం
వర్షాకాలంలో ఉప్పు షేకర్ నుంచి ఉప్పు రావడం కాస్త కష్టమే. ఎందుకంటే అది తడిగా మారిపోయి రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఉప్పు రాదు. షేకర్ లో కొన్ని బియ్యం గింజలు పెట్టారంటే ఉప్పు సులువుగా వచ్చేస్తుంది.
మైక్రోవేవ్ ఇలా శుభ్రం చేయండి
మైక్రోవేవ్ బయట నుంచి శుభ్రం చేయడం సులభమే కానీ మరి లోపలి మరకలు తొలగించడం ఎలా? అందుకు మీకు ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో నీరు, నిమ్మకాయ వేసి దాన్ని3-4 నిమిషాల పాటు మైక్రోవేవ్ అవేన్ లో ఉంచాలి. తర్వాత దాన్ని శుభ్రంగా క్లాత్ తీసుకుని తుడుచుకుంటే సరిపోతుంది.
కాలీఫ్లవర్ కొనుగోలు ఎలా?
కూరగాయలు అన్ని పుచ్చులు లేకుండా జాగ్రత్తగా కొనుగోలు చేస్తారు. కానీ కాలీఫ్లవర్ విషయంలో మాత్రం కాస్త తడబాటు పడతారు. వాటిలో పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒకటి కొనుక్కుని తర్వాత దాన్ని వండుకోవడం కోసం శుభ్రం చేసుకోవడం పెద్ద తలనొప్పి పని. అందుకే మీరు దాన్ని కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. పువ్వు గట్టిగా ఎటువంటి రంధ్రాలు లేకుండా మూసేసి ఉన్నట్టుగా ఉంటే దాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఏ మాత్రం పువ్వులో పగుళ్లు లేదా రంధ్రాలు కనిపించాయా అసలు కొనుక్కోవద్దు. అందులో తప్పకుండా పురుగులు ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: విటమిన్-D లోపంతో కండరాల నొప్పులు - ఇవి తింటే ఉపశమనం