Hyderabad police alert for Sankranti హైదరాబాద్: తెలుగు వారి పెద్ద పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఇప్పటికే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ( Sankranti Holidays) ఇచ్చేయగా, కాలేజీలకు సైతం సెలవుల్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే పండుగ సమయంలో చోరీలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వాసులను హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి పండుగ ( Sankranti 2024) జరుపుకునేందుకు సొంతూరుకు వెళ్లేవారు, ఇక్కడ వారి ఇళ్లల్లో చోరీ జరగకుండా ఉండకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలని సూచించారు. సంక్రాతి పండుగ సెలవులలో దొంగతనాల నివారణకై సొంతూరుకు వెళ్తున్న వారికి హైదరాబాద్ పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా లగేజీ ప్యాక్ చేసేశాం, మేం ఊరికి బయలుదేరుతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం లాంటి పిచ్చి పనులు అస్సలు చేయవద్దని పోలీసులు అలర్ట్ చేశారు.
పండుగకు ఊరెళ్తున్నారా, పోలీసుల సూచించిన జాగ్రత్తలు ఇవే..
- ఊరు వెళ్లాల్సి వస్తే మీ ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలి. అది కుదరకపోతే మీ ఇంట్లోనే సీక్రెస్ ప్లేస్‌లో వాటిని దాచిపెట్టండి.
- పండుగ సెలవులలో బయటకు వెళుతున్నప్పుడు మీ ఇంట్లో సెక్యూరిటీ అలారం అమర్చడం, మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
- వీలైతే మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళము అమర్చుకోవడం బెటర్.
- తాళము వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే.. మీరు నివాసం ఉండే చోట స్థానిక పోలీసు స్టేషన్లో మీ సమాచారము ఇవ్వండి
- మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. లేదా 100 కు కాల్ చేసి వివరాలు చెప్పాలి
- మీ వాహనాలను మీ ఇంటి ఆవరణ లోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి, మరియు మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వెయ్యడం మంచిది.
- మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను online లో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి
- నమ్మకస్తులైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి
- మెయిన్ డోర్‌కి తాళం కప్ప వేసినప్పటికీ.. అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయాలి
- బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి లోపల, బయట సైతం కనీసం కొన్ని లైట్లు వేయాలి
- మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, News Papers, పాలప్యాకెట్లు ఉండకుండా చూడాలి. అవి గమనిస్తే ఇంట్లో ఎవరూ లేరని దొంగతనాలు చేస్తారని గుర్తుంచుకోండి.
- నమ్మకమైన ఇరుగు పొరుగు వారికి మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండాలని చెప్పడం బెటర్
- మీ ఇంటికి వచ్చే, వెళ్లే దారులు, ఇంటిలోపల సీసీ కెమెరాలు (CC Camera) అమర్చు కొని DVR కనపడకుండా ఇంట్లో రహస్య ప్రదేశంలో పెట్టుకోండి.
- బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్ లకు, గుడికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రతలు తీసుకోండి
- మీరు బయటికి వెళ్ళే విషయాన్ని సోషల్ మిడియాలో షేర్ చేయకపోతే మంచిది
- అల్మరా, కప్ బోర్డ్స్ కు సంభందించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు, వంటింటి కప్ బోర్డ్స్ లాంటి చోట కాకుండా.. మీ ఇంట్లోనే సీక్రెట్ ప్లేస్‌లో పెట్టుకోవడం మంచిదని సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్తున్న వారికి పోలీసులు ఈ జాగ్రత్తలు సూచించారు.