ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌ టూర్ టూర్ ఖరారైంది. వందే భారత్ రైలు ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ.  వాటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్యన తిరిగే వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. ఇది దేశంలోని 13వ వందేభారత్ రైలు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ ట్రైన్ వల్ల ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8:30 గంటలకు తగ్గిపోతుంది.  


అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌


అనంతరం రూ. 715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారు. ఇందులో భాగంగా రాబోయే 40 సంవత్సరాల వరకు అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్‌ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెన చేపడుతున్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రేతిఫైల్ బస్ స్టేషన్ కు నేరుగా కనెక్టివిటీని పెంచుతారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, వచ్చే/వెళ్ళే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాలను అభివృద్ధి పనులలో భాగంగా చేపడుతున్నారు.


13 కొత్త MMTS సర్వీసుల ప్రారంభోత్సవం


అనంతరం, సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్య రూ. 1,410 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన 85 కి. మీ. పొడవైన డబ్లింగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సామాన్య ప్రజల రైలుగా పిలవబడే MMTS ఫేజ్- IIలో భాగంగా హైదరాబాద్ నగర శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీద నడిచే 13 కొత్త MMTS సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. MMTS ఫేజ్- II లో భాగంగా బొల్లారం, మేడ్చల్ మధ్యన 14 కి. మీ.లు, ఫలక్ నుమా-చందానగర్ మధ్యన 14 కి. మీ.ల పొడవున కొత్త డబ్లింగ్ లైన్లను నిర్మించారు. ఈ అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలకు సంబంధించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనను ప్రధాని తిలకిస్తారు.  


పరేడ్ గ్రౌండులో బహిరంగసభ


అనంతరం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు ప్రధానమంత్రి వెళతారు. పరేడ్ గ్రౌండుకు చేరుకున్న తరువాత మొదట రూ. 7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 6 జాతీయ రహదారులకు, రూ.1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ ఆవరణలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో అకడమిక్ కోర్సులకు అనుగుణంగా బిల్డింగ్ బ్లాక్ ల నిర్మాణం, ఆడిటోరియం, స్టాఫ్ క్వార్టర్లు, హాస్టల్స్, గెస్ట్ హౌస్‌లు, హాస్పిటల్ బ్లాక్ ఆధునికీకరణ వంటి పనులను చేపడతారు. ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం తర్వాత బేగంపేట విమానాశ్రయం చేరుకుని, ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.