Mlc Kavitha : దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోసపూరిత హామీలతో బీజేపీ యువతను మోసం చేసిందని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని ఆ హామీ ఏమైందని ప్రధాని మోదీని ఉద్దేశించి కవిత ట్వీట్ చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు.  ఆ ఉద్యోగాలు భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవని, కానీ డిగ్రీ లేని వ్యక్తికి దేశంలో అత్యున్నతమైన ఉద్యోగం ఉందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. 


నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు 


దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని కవిత అన్నారు. నిరుద్యోగ రేటు మూడు నెలల గరిష్ట స్థాయికి చేరిందన్నారు. కానీ యువత పట్ల ఏమైనా ఆందోళన, యువత శక్తి, సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి ఏమైనా చేస్తున్నారా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నేడు దేశంలో నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవని, కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉందని ప్రధాని మోదీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. 






నా సర్టిఫికెట్లు షేర్ చేయమంటారా?- కేటీఆర్ 


ప్రధాని మోదీ విద్యార్హతపై మంత్రి కేటీఆర్ కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. ఇటీవల ట్విట్టర్ లో తన విద్యార్హతలను షేర్ చేశారు. పుణే యూనివర్సిటీలో మంత్రి కేటీఆర్ చదువుకున్నారు. అక్కడ బయో టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు కేటీఆర్. ఆ సర్టిఫికెట్లను బహిరంగంగా షేర్ చేయమంటారా? అనే ప్రశ్నించారు. ప్రధాని మోదీ విద్యార్హతలను ప్రశ్నించిన అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ హైకోర్టు భారీగా జరిమానా విధించిన వేసిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. తమ తమ విద్యార్హత సర్టిఫికెట్లను వెల్లడిస్తూ పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.  


 అనుమానం మరింత పెరిగింది


 ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రధాని మోదీ ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.  దీనిపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ తీర్పుతో ప్రధాని మోదీ విద్యార్హతపై అనుమానం మరింత పెరిగిందని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రధాని మోదీ విద్యావంతుడైతే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండకపోయేవారని విమర్శలు చేశారు.