Hyderabad Police Arrested Illegal Camel Slaughters: అక్రమంగా ఒంటెలను వధిస్తున్న (Camel Slaughters) ముగ్గురు నిందితులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Hyderabad Taskforce Police) అరెస్ట్ చేశారు. ఆదివారం హకీంపేట్ కుంట (Hakimpet kunta) వద్ద 4 ఒంటెలను రక్షించి జంతువులను వధించేందుకు వాడే కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒంటెలను అక్రమంగా వధించి వాటి మాంసాన్ని విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని టోలిచౌకీలోని హకీంపేట్ కుంటకు చెందిన మాంసం దుకాణం యజమాని మహ్మద్ ఇస్మాయిల్ (30), అందులో పని చేసే మరో వ్యక్తి మహ్మద్ సల్మాన్ (23), అదే ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సిరాజ్ ఖాన్ (40)గా గుర్తించారు.


7 ఒంటెల కొనుగోలు


గతంలో బీఫ్ షాపులో పని చేసే ఇస్మాయిల్ ప్రస్తుతం పారామౌంట్ కాలనీలో సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. అతను తన సహచరులతో కలిసి ఒంటె మాంసాన్ని వినియోగదారులకు విక్రయించి సులంభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన శ్యామ్ అనే వ్యక్తిని 3 నెలల క్రితం సంప్రదించి అతని నుంచి 7 ఒంటెలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే మూడింటిని వధించి కిలో రూ.400 చొప్పున వినియోగదారులకు విక్రయించినట్లు వెల్లడించారు. మిగిలిన నాలుగింటిని వేరే ప్రాంతంలో అక్రమంగా దాచగా, పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు వివరించారు. నిందితులందరినీ అరెస్ట్ చేసి కత్తులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిని తదుపరి విచారణ నిమిత్తం ఫిలింనగర్ పోలీసులకు అప్పగించారు. చట్టం అనుమతించిన జంతువులు మినహా మిగిలిన ఎలాంటి జంతువులనైనా వధించడం చట్ట విరుద్ధమని, వధ కోసం ఒంటెలను కొనుగోలు చేయడం నేరమని పోలీసులు తెలిపారు. ఎవరైన చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Also Read: Medak Accident News: మెదక్ జిల్లాలో కూలిన ఫైటర్ జెట్ విమానం - ఇద్దరు దుర్మరణం?