MP Vijayasai Reddy : చిన్న వయసులో తారకరత్న మృతి చెందటం చాలా బాధాకరం అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న స్థాయి పై స్థాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరించే వ్యక్తి తారకరత్న అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశం చేద్దాం అనుకునే లోపు ఇలాంటి ఘటన జరగటం నన్ను చాలా బాధించిందన్నారు. ప్రతి ఒక్కరిని బంధుత్వంతో పిలిచే వ్యక్తి తారకరత్న అని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తారకరత్నకు ముగ్గురు పిల్లలు మొదట ఒక పాప ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలు, కవలల్లో ఒక బాబు ఒక పాప ఉన్నారన్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా తిరిగి వస్తారని ప్రతి ఒక్కరూ భావించారన్నారు.
నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు
నేటి (సోమవారం) ఉదయం 9 గంటల మూడు నిమిషాలకి శంకరపల్లిలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు తారకరత్న పార్థివదేహాన్ని తరలిస్తామని తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ వద్ద అభిమానుల సందర్శనార్థం ఉంచుతామన్నారు. బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ఆధారంగా రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. తారకరత్న భార్య అలేఖ్య కొంత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, కాళ్లు చేతులు వణుకుతున్నాయని తెలిపారు. తాను అత్యంతగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన బాధ ఆమె భరించలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.
బాలకృష్ణకు ధన్యవాదాలు
"తారకరత్న మరణం కుటుంబ సభ్యులు, అభిమానులను ఎంతో బాధించింది. 39 ఏళ్లకే ఆయనకు ఇలా జరగడం దురదృష్టకరం. సినిమా రంగంలో ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉన్నారు. ప్రతి ఒక్కరినీ కూడా వరసలతో పిలిచే నైజం ఆయనది. తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. వైద్యులతో మాట్లాడి చికిత్సలో ఎటువంటి జాప్యం లేకుండా బాలకృష్ణ ప్రయత్నం చేశారు. అందుకు బాలకృష్ణకు ధన్యవాదాలు."- ఎంపీ విజయసాయి రెడ్డి
ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు- చంద్రబాబు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శంకర్ పల్లి సమీపంలోని నందమూరి తారకరత్న ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. తర్వాత తారకరత్న చిత్ర పటానికి పూలు సమర్పించి, నమస్కరించారు. తారకరత్న భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పరామర్శించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును పలకరించారు. కాసేపు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. విజయసాయి రెడ్డి తరచూ చంద్రబాబు లక్ష్యంగా పరుష పదజాలంతో ట్విటర్ వేదికగా ట్వీట్లు చేసే సంగతి సంగతి తెలిసిందే. అనంతరం విజయసాయి రెడ్డితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒక మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన చెందారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని కూడా తనతో చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ అవకాశం కూడా ఇద్దామనుకున్నామని, దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని తనతో చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఈ లోపే తారకరత్న చనిపోవడం బాధాకరమని అన్నారు.
‘‘ఈనెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు నిండుతాయి. ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయాం. సినిమా రంగంలో ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనది. అమరావతి అనే సినిమాలో నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోంది. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయింది. చిన్న వయసులో ఏ ఆశయాల కోసం తారకరత్న పని చేశారో వాటిని ముందుకు తీసుకెళ్లేలా అభిమానులు పని చేయాలని అనుకుంటున్నా. తారకరత్నకు ముగ్గురు పిల్లలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. మేం వారికి ఎప్పుడూ అండగానే ఉంటాం. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డితో కలిసి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.