MotorCycle Helmets History:
ఆసక్తికర చరిత్ర..
హ్యూమన్ ఎవల్యూషన్‌లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ఆలోచనలు మొత్తం లైఫ్‌స్టైల్‌నే మార్చేశాయి. మరి కొన్ని మన లైఫ్‌స్టైల్‌లో భాగమయ్యాయి. అలాంటి వాటిలో ఒకటి బైక్‌లు. మన ముందు తరాల వాళ్లకు సైకిల్ ఎలానో...ఇప్పుడున్న తరానికి బైక్‌లు అలాగన్నమాట. అంటే...ప్రతి ఇంటికి కనీసం ఓ బైక్ తప్పకుండా ఉంటుంది. ప్రస్తుత అవసరాలు కూడా అలానే ఉన్నాయి. ఎక్కడికెళ్లాలన్నా బండి బయటకు తీస్తున్నాం. మరి బండిపైన వెళ్లేప్పుడు మన సేఫ్‌టీ కూడా చూసుకోవాలిగా. యాక్సిడెంట్ అయినప్పుడు మనల్ని కాపాడే ఒకే ఒక పరికరం హెల్మెట్. అందుకే...ట్రాఫిక్ పోలీసులు అంతగా "హెల్మెట్‌లు" పెట్టుకోండి అని అవగాహన కల్పిస్తుంటారు. పెట్టుకోకపోతే చలాన్లూ వేస్తున్నారు. ఎన్నో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలు కాపాడాయి హెల్మెట్‌లు. ఇదంతా సరే. మరి మన లైఫ్‌కి సేఫ్టీ ఇస్తున్న ఈ "హెల్మెట్" ఎలా పుట్టిందో తెలుసా..? మొట్ట మొదట ఈ హెల్మెట్ ఎవరు వాడారు..? (History of Helmets) మొదట దేనితో తయారు చేశారు..? అక్కడి నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండెడ్ హెల్మెట్‌ల వరకూ ఈ జర్నీ ఎలా సాగింది..? ఆ ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఇప్పుడు తెలుసుకుందాం.
80 ఏళ్ల కిందటే..
హెల్మెట్‌కి 80 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు వీటిని స్కల్‌క్యాప్ (SkullCap) అని పిలిచే వాళ్లు. మొదట్లో వీటిని చెక్కతో తయారు చేశారు. మనకు 1900 సంవత్సరానికి ముందు మోటార్ సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని "మోటరైజ్డ్ బైస్కిల్స్" అని పిలిచే వారు. ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు వీటిని ఎక్కువగా వినియోగించే వాళ్లు. క్రమంగా వీటి తయారీ పెరిగింది. క్రేజ్ కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. మొదట కేవలం రవాణాకు మాత్రమే ఉపయోగపడ్డ ఈ మోటార్ సైకిళ్లు...ఆ తరవాత రేసింగ్ ఆలోచనకూ బీజం వేశాయి. కొందరు రేసింగ్ పెట్టుకుని ఈ బైక్‌లపై దూసుకెళ్లే వారు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురయ్యే వాళ్లు. ముఖ్యంగా ముఖానికి, తలకు ఎక్కువగా గాయాలయ్యేవి. సరిగ్గా అదే సమయంలో ఓ వైద్యుడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. తలకు, ముఖానికి గాయాలు కాకుండా ప్రొటెక్షన్ ఇవ్వలేమా అని ఆలోచించాడు. అనుకున్న వెంటనే రీసెర్చ్ చేసి ఓ షెల్ తయారు చేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే చిప్ప లాంటిదన్నమాట. సులువుగా తలపై పెట్టుకునేలా దాన్ని డిజైన్ చేశాడు. ఆ వ్యక్తి పేరే డాక్టర్ ఎరిక్ గార్డ్‌నర్ ( Dr. Eric Gardner). అదిగో అలా పుట్టింది హెల్మెట్ (Helmet Invention). 1914లో దీన్ని తయారు చేశారు ఎరిక్.
ఆ ఘటనతో అలెర్ట్..
అప్పటికే రేసింగ్‌ల ట్రెండ్ ఊపందుకుంది. తాను తయారు చేసిన హెల్మెట్‌లను రేసర్లు అందరూ పెట్టుకోవాలని సూచించాడు డాక్టర్ ఎరిక్ గార్డ్‌నర్. ఆయన సలహా మేరకు రేసర్లు అందరూ వాటిని పెట్టుకున్నారు. వాళ్లలో కొందరు కింద పడ్డా కూడా తలకు, ముఖానికి ఎలాంటి గాయాలు కాకుండా ఆ హెల్మెట్ రక్షించింది. అందరూ ఆ డాక్టర్‌ను ఆకాశానికెత్తేశారు. అయితే...ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. ఇది సేఫ్‌టీ ఇస్తున్నప్పటికీ డిజైన్ పరంగా అందరినీ ఆకట్టుకోలేదు. "చిప్ప"లాంటి ఆ హెల్మెట్‌లను పెట్టుకోడానికి కొందరు నామోషీగా ఫీల్ అయ్యారు. అందుకే....అంత కష్టపడి తయారు చేసిన హెల్మెట్‌లను పక్కన పెట్టేసి చూడటానికి అందంగా, హుందాగా కనిపించే "లెదర్ క్యాప్‌లు" పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఆ తరవాత జరిగిన ఓ సంఘటన అందరి వెన్నులోనూ వణుకు పుట్టించింది. హెల్మెట్‌లు ఎంత ముఖ్యమో చాటి చెప్పింది. అప్పటి బ్రిటన్ ఆర్మీ ఆఫీసర్ టీఈ లారెన్స్ (T.E. Lawrence) బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అప్పటికప్పుడు ఆర్మీలో పని చేసే వాళ్లంతా రబ్బర్, కార్క్‌తో తయారు చేసిన హెల్మెట్‌లు పెట్టుకోవాల్సిందేనని ఆర్డర్‌లు పాస్ చేసింది ప్రభుత్వం.
డిజైన్‌లో మార్పులు..
1953లో University of South Californiaకు చెందిన ప్రొఫెసర్ C.F. Lombard అప్పటికే ఉన్న డిజైన్‌కు మార్పులు చేర్పులు చేసి కొత్త హెల్మెట్ తయారు చేశారు. మొత్తం మూడు లేయర్స్‌తో డిజైన్ చేశారు. ఫైబర్ గ్లాస్, ఫోమ్‌తో తయారు చేశారు. ఈ డిజైన్‌కు మార్కెట్‌లో కాస్త క్రేజ్ వచ్చాక వెంటనే వీటిని పెద్ద ఎత్తున తయారు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి మొదలైన ట్రెండ్ 1960ల నాటికి ఊపందుకుంది. చాలా మంది పౌరులు హెల్మెట్‌లు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరిచారు. క్రమంగా అదో అలవాటుగా మారింది. 1963లో ముఖాన్ని పూర్తిగా కవర్ చేసేలా హెల్మెట్ డిజైన్‌లు వచ్చాయి. నాసా ఆస్ట్రోనాట్‌లు కూడా ఈ హెల్మెట్‌లు పెట్టుకోవడం మొదలు పెట్టారు. 1964లో హెల్మెట్‌ల తయారీకి సేఫ్‌టీ స్టాండర్డ్స్‌ని ప్రవేశపెట్టారు. 1970,80ల నాటికి పూర్తిగా ఇవి అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి అలా దశల వారీగా వాటి డిజైన్‌లలో మార్పులు చేర్పులు చేస్తూ ఎన్నో కంపెనీలు వాటిని తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు మార్కెట్‌లో చూస్తున్నాం కదా. ఎన్ని రకాల డిజైన్‌లున్నాయో. అదన్న మాట హెల్మెట్ హిస్టరీ.