Minister Harish Rao : బీజేపీ అంటేనే జూటా, జుమ్లా పార్టీ అంటూ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలైందా అంటూ ప్రశ్నించారు. మునుగోడులో గెలిస్తే రూ.3 వేల పింఛన్ ఇస్తామంటున్న బీజేపీ నేతలు, ఆ హామీని తెలంగాణ అంతటా అమలు చేస్తామని ప్రధాని మోదీ, అమిత్‌షాతో చెప్పించాలన్నారు. లేదంటే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు బీజేపీపై మండిపడ్డారు. మద్దతు ధరపై మోదీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రైతు చట్టాలను రద్దు చేసి జాతికి ప్రధాని క్షమాపణ చెప్పి ఏడాది గడుస్తుందని గుర్తుచేశారు. మద్దతు ధరకు చట్టబద్దత తీసుకొస్తామని చెప్పిన ప్రధాని ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే మునుగోడులో బీజేపీ నేతలు ఇచ్చే హామీలు విలువేంటని ప్రశ్నించారు.
మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యకు చెక్
ప్రపంచ ఆరోగ్య సంస్థ మునుగోడులో ఫ్లోరైడ్ లేని తాగునీటిని సరఫరా చేయకపోతే నో మ్యాన్ జోన్‌గా మారుతుందని హెచ్చరించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌లో మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్లోరైడ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం ఒక్క పైసా సాయం చేయలేదని ఆరోపించారు.
8 ఏళ్లుగా కృష్ణా జలాల్లో వాటా తేల్చలేదు
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని ప్రధాని మోదీ మాట్లాడారన్నారు. నల్గొండకు నీళ్లు ఇవ్వని బీజేపీకు మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదన్నారు. 8 ఏళ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోవడంతో నల్గొండ, మునుగోడుకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కోర్టులో కేసు ఉపసంహరించు వెంటనే వాటా తెలుస్తామని చెప్పారని, కేసు ఉపసంహరించుకుని పది నెలలు అయినా ఇంత వరకూ కృష్ణా జలాల్లో కేటాయింపులు చేయలేదన్నారు. ఫ్లోరోసిస్‌ను మునుగోడు నుంచి పారదోలింది సీఎం కేసీఆర్ కాదా? అంటూ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. సూర్యాపేట, నల్గొండకు మెడికల్ కాలేజీలు కేటాయించామన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్క కాలేజీ కూడా తెలంగాణకు ఇచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Munugode Bypolls: రాజగోపాల్ రెడ్డికి ఓటు వేస్తే మోరిలో వేసినట్టే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి