Minister KTR : హైదరాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, ఇతర విభాగాలు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. వర్షాకాలం సమీస్తున్న నేపథ్యంలో వర్షకాల ప్రణాళికను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. నగరంలో భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వరద నివారణ చర్యలపై మంత్రి కేటీఆర్ ప్రధానంగా చర్చించారు. వరద నివారణ కార్యక్రమాలను జీహెచ్ఎంసీ జలమండలి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
జలమండలి ఎస్టీపీలపై మంత్రి కేటీఆర్ ఆరా
జలమండలి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కార్యక్రమాల వివరాలను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. జలమండలి ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్న ఎస్టీపీల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు హైదరాబాద్ లో లింకు రోడ్ల నిర్మాణం, స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ కార్యక్రమం, హైదరాబాద్ రోడ్ల నిర్మాణంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తొమ్మిది లైన్ల డ్రిప్ ఇరిగేషన్ పైపులు
ఔటర్ రింగ్ రోడ్ పైన గ్రీనరీ నిర్వహణకు సంబంధించి అవసరమైన నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర తొమ్మిది లైన్లతో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. 9 లైన్ల డ్రిప్ ఇరిగేషన్ పైపులు, SCADA వీటిని నిర్వహిస్తుంది. దీంతో 6 లక్షల లీటర్లు నీరు ఆదా అవుతుంది. సంవత్సరానికి రూ.6 కోట్ల వ్యయం తగ్గనుంది.