Minister KTR : నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలను  టీఆర్ఎస్ కైవసం చేసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక విజయం తర్వాత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్... నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టులతో తెచ్చిన ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారన్నారు. అహంకారంతో, డబ్బు మదంతో కళ్లు నెత్తికొక్కి మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దారని కేటీఆర్ విమర్శించారు. దిల్లీ బాసులు మోదీ, అమిత్ షాకు తెలంగాణ ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో కనిపించింది రాజగోపాల్ రెడ్డి అయినా వెనకుండి నడిపించింది దిల్లీ బాసులు అని మండిపడ్డారు. 9 రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చారని, తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని మంత్రి కేటీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 






వందల కోట్లు కుమ్మరించారు 


"మునుగోడు రాజకీయ క్రీడకు తెరలేపింది మోదీ, అమిత్ షా. బీజేపీ దిల్లీ నాయకత్వం, గల్లీ నాయకత్వం వందల కోట్ల రూపాయలు తెచ్చి ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నించారు. దిల్లీ నుంచి డబ్బు సంచులు తెచ్చి మునుగోడులో గుమ్మనించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రకటన రాగానే కోటి రూపాయలతో బీజేపీ లీడర్ పట్టుపడ్డారు. ఈటల రాజేందర్ పీఏ కూడా డబ్బుతో పట్టుబడ్డారు. డా.వివేక్ గుజరాత్ నుంచి హవాలా రూపంలో నగదు తెచ్చి రాజగోపాల్ రెడ్డి, జమునా హచరీస్ కు బదిలీ చేసింది నిజం కాదా?. ఎవరి కోసం ఈ కోట్ల రూపాయలు బదిలీ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన ఇన్ ప్రా కంపెనీ నుంచి ఓటర్లకు నగదు బదిలీ చేశారు. దీనిని డాక్యుమెంటరీ ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశాం. అయితే ఈసీపై కేంద్ర పెద్దలతో ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా చేశారు. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దించి గ్రామాలపై దండయాత్ర చేశారు. కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ఈసీకి ఫిర్యాదు చేశాం. కేంద్రంలోని బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు కానీ టీఆర్ఎస్ మెజార్టీని తగ్గించగలిగారు."- మంత్రి కేటీఆర్ 



అభివృద్ధికే పట్టం 


మునుగోడు ప్రజలు అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగుర వేసినందుకు నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలను ధనమయం చేసేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసిందన్నారు.  ఎన్నికల డబ్బుమయం అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయని, అయితే హుజూరాబాద్ , మునుగోడులో ధనవంతులు బరిలోకి దిగిన తర్వాతే డబ్బు మయం అయ్యాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఇద్దరు ధనవంతులను తీసుకొచ్చిన బీజేపీ ఎన్నికలను డబ్బుమయం చేశాయని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు దిల్లీ నుంచి పంపి ఎన్నికలను ధనమయం చేశారని విమర్శించారు.