Minister KTR : కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ అబద్ధాలతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచాలని మంత్రి కేటీఆర్ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో కేంద్రమంత్రి  పార్లమెంట్ ను అబద్ధాలతో తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. మాండవీయపై లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలన్నారు. కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్ ను తెలంగాణకు కేటాయించకుండా తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజకీయాలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని విమర్శించారు. 


మౌఖికంగా ఒకటి, లిఖితపూర్వకంగా మరొకటి


పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఓ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇస్తూ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌కు బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌లను మంజూరు చేసిందని పేర్కొంది. వీటికి రూ.1,000 కోట్లు అవసరమని అంచనా వేశామని, తొలి విడతలో ఒక్కొ దానికి రూ.300 కోట్ల చొప్పున విడుదల చేస్తామని శుక్రవారం లోక్‌సభలో కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ మౌఖికంగా స్పష్టం చేశారు. అయితే కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో మాత్రం గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను కేటాయించామని తెలిపారు. దీంతో కేంద్రం రెండు నాల్కల ధోరణి మరొకసారి బయటపడిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 






మూడు రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్కులు 


బల్క్ డ్రగ్స్ తయారీకి తోడ్పాటు అందించేందగుకు కేంద్రం బల్క్ డ్రగ్ పార్క్ లను ఏర్పాటుచేస్తుంది. బల్క్ డ్రగ్ పార్క్స్ ప్రమోట్ పథకం కింద హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతిపాదనలకు ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్‌మెంట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ పార్క్ లకు ఆర్థిక వ్యయం కింద రూ. 3,000 కోట్లను 2020లో నోటిఫై చేశారు. మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్‌ల ఏర్పాటు కోసం ఆర్థిక సాయం అందించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా బల్క్ ఔషధాల తయారీ వ్యయాన్ని తగ్గించడం, దేశీయ పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. 


ఒక్కో పార్క్ కు రూ.1000 కోట్లు 


ఈ పథకం కింద అభివృద్ధి చేయబోయే బల్క్ డ్రగ్ పార్కులు ఒకే చోట సాధారణ మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. తద్వారా దేశంలో బల్క్ డ్రగ్ తయారీకి బలమైన వ్యవస్థను సృష్టిస్తారు. తయారీ వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్ని్స్తారు. ఈ పథకం దేశీయంగా బల్క్ డ్రగ్స్ తయారీని ప్రోత్సహిస్తుంది. దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, గ్లోబల్ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించడానికి వీటిని ఏర్పాటుచేస్తున్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్‌కు ఆర్థిక సహాయం కింద ఉమ్మడి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు వ్యయంలో 70% కేటాయిస్తారు. హిమాచల్ ప్రదేశ్ వంటి హిల్లీ స్టేట్స్ కు ఈ ప్రాజెక్ట్ వ్యయంలో 90% ఆర్థిక సహాయం కేంద్రం చేస్తుంది. ఒక బల్క్ డ్రగ్ పార్క్ కోసం పథకం కింద గరిష్టంగా రూ. 1000 కోట్లు అందిస్తుంది కేంద్రం.