KCR Kit Viral Video : కేసీఆర్ కిట్ పై ఉన్న సీఎం బొమ్మని చూస్తూ ఓ చిన్న పాప ముద్దాడిన వీడియో వైరల్ అవుతోంది. తాత అంటూ చిన్నారి అల్లరి చేస్తు్న్న వీడియో ఎంతో ముచ్చటగా ఉంది. ఈ వీడియోను మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ..." కేసీఆర్ కిట్ ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనసు పొంగిపోతుంది. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తుంది." రాశారు.
కేసీఆర్ కిట్
తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 4వ తేదీన కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించింది. రూ.2 వేలు విలువ చేసే కిట్ మహిళలకు అందిస్తోంది. ఇందులో పుట్టిన బిడ్డకు అవసరమయ్యే ప్రతి వస్తువు ఉంటుంది. కిట్ తో పాటు మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూలి పనులకు వెళ్లకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు కూడా అందిస్తున్నాయి. కేంద్రం రూ.6 వేలు, రాష్ట్రం రూ.6 వేలు కలిపి మొత్తం రూ.12 వేలు గర్భిణీల ఖాతాల్లో జమ చేస్తారు. ఆడ పిల్ల పుడితే మరో రూ. వెయ్యి అదనంగా అందిస్తారు. గర్భం దాల్చింది మొదలు నాలుగు విడతలుగా ఈ నగదును మహిళల ఖాతాల్లో వేస్తారు. అయితే గడిచిన రెండేళ్లల్లో చాలా మందికి ఈ నగదు వేయడం లేదు. డెలివరీ సమయానికి రూ.8 వేలు రావాల్సి ఉంటే రెండో సంతానం అయ్యే వరకు కూడా నగదు ఖాతాల్లో జమకావడం లేదని మహిళలు అంటున్నారు. ఈ కిట్ లో నవజాతు శిశువులకు అవసరమైన అన్ని వస్తువులు ఉంటాయి. ఈ కిట్‌లో మహిళలకు, పిల్లలకు కావాల్సిన 16 రకాల వస్తువులు ఉంటాయి. ఈ కిట్‌లో పుట్టిన పిల్లలకు అవసరమయ్యే డైపర్లు, నాప్కిన్స్, టోయ్స్, దోమ తెరలు, బేబీ పౌడర్, బేబీ ఆయిల్, బేబీ సోపులు, పిల్లలకు కావాల్సిన బట్టలు ఉంటాయి.
కేసీఆర్ న్యూట్రీషన్ కిట్
"బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ ఇవ్వబోతున్నాం. అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో ఈ కిట్ ఇస్తున్నాం. 1.50 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరుతుంది. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం దీని లక్ష్యం. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.2000 ఉంటుంది. రెండు సార్లు ఇస్తాం. కిట్‌లో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్ కిలో- 2 బాటిల్స్, ఒక కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి ఉంటాయి. 13.30 లక్షల కేసిఆర్ కిట్స్ లబ్ధిదారులు ఉన్నారు. వారికి రూ.1200 కోట్ల నగదు అందించాం." అని మంత్రి హరీశ్ రావు ఇటీవల తెలిపారు.