Minister KTR : తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించమని ప్రధాని మోదీ మాయ మాటలు చెప్పారని విమర్శించారు. సింగరేణికి చెంందిన నాలుగు బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు లోక్‌సభలో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే తెలంగాణను కుప్పకూల్చడమే అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తరహాలో గనులు కేటాయించకుండా ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలన్న అభ్యర్థనను పట్టించుకోకుండా గుజరాత్‌కు మాత్రం గనులు కేటాయించుకున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణపై పక్షపాతం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.






సింగరేణి గనులు ప్రైవేటుపరం 
 
సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.  అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన తెలంగాణపై బీజేపీ కక్ష కట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నో రోజుల నుంచి టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని విమర్శించారు. లోక్ సభలో బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణలోని నాలుగు సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు ప్రకటించారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్షగట్టారని, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా అనేక సార్లు మోదీ వ్యాఖ్యలు చేశారన్నారు. తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాన్ని కేంద్రం కొనసాగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం సృష్టించిన అన్ని అడ్డంకులను దాటుకొని అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆయువుపట్టు అయిన సింగరేణిపై దెబ్బకొట్టేందుకు కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటీపరం చేస్తోందని ఆరోపించారు.


తెలంగాణపై కక్ష సాధింపు


 కేంద్రం గుజరాత్ కు నామినేషన్ పద్ధతిలో లిగ్నైట్ గనులు కేటాయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గుజరాత్ మాదిరి తెలంగాణలోని సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ గుజరాత్‌కు ఒక న్యాయం తెలంగాణకు మరొక న్యాయం అన్నట్లుగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని కేటీఆర్ విమర్శించారు. ప్రధానిగా ఎన్నికవ్వగానే  గుజరాత్‌పై పక్షపాతంతో 2014 ఆగస్టులోనే లిగ్నైట్ గనులను ఆ రాష్ట్రానికి కేటాయించారని ఆరోపించారు. 2015 సంవత్సరం జులై 27న కేంద్రం, లిగ్నైట్ బొగ్గు గనులను గుజరాత్ కు కేటాయించిందన్నారు. దీంతో పాటు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన పర్యావరణ అనుమతుల పత్రాలను కూడా కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణికి బొగ్గు పనులు కేటాయించాలని సింగరేణి కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కేంద్రాన్ని కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గుజరాత్ కోసం వేలం పాలసీలను పక్కన పెట్టిన ప్రధానమంత్రి తెలంగాణపై కక్షతో సింగరేణి గనులకు వేలం వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్ని రోజులని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.