Minister Harish Rao : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహరంలో దొరికిపోయిన బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే బీజేపీ భుజాలు తడుముకుంటుందన్నారు. ముందు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలు మాకు తెలియనే తెలియదన్నారని, ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత బీజేపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందన్నారు. బీజీపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో తడి బట్టలతో ప్రమాణాలు చేశారని, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టుల్లో అరెస్ట్ అయిన వారిపై దర్యాప్తు చేయకుండా పిటిషన్ వేశారన్నారు. విచారణ ఆపండి, ఈ కేసు ఢిల్లీకి ఇవ్వండి, అని కోర్టుల్లో పిటిషన్లు వేశారన్నారు.
సంబంధంలేదంటూనే కోర్టులో పిటిషన్లు
"మాకు సంబంధం లేదంటారు. కోర్టుల్లో పిటిషన్లు వేసి విచారణ ఆపుతారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు. కేసు తొందరగా విచారణ జరగాలి. న్యాయం జరగాలి. నిష్పాక్షంగా దర్యాప్తు జరగాలని ఏ రాజకీయ నాయకుడైనా, పార్టీ అయినా అడుగుతారు. కానీ దర్యాప్తు ఆపాలి అంటే.. అర్థం ఏంటి. అసలు బండారం బయట పడుతుందని బీజేపీ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇవాళ బీజేపీ నేతల సంభాషణ విన్నారు. వారు ఈ వీడియోల ప్రస్తావన కోసం మాట్లాడుతున్నారు. తెలంగాణ పోలీసుల మీద, ఐపీఎస్ అధికారుల మీద బీజేపీకి నమ్మకం లేదు. తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేకపోతే..తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతున్నారు. బీజేపీది తెలంగాణ వ్యతిరేక ధోరణి. బీజేపీ 16-17 రాష్ట్రాల్లో ఉంది కదా.. ఆ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం లేదా. అక్కడ కేసులన్నీ సీబీఐకి ఇవ్వమని అడుగుతారా? . ఎమ్మెల్యేలకు ఎర కేసులో లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవసరం ఏమొచ్చింది. ఎంక్వైరీ ఆపమని, సిట్ ను ఆపమని ఎందుకు బీజేపీ నేతలు అడుగుతున్నారు." - మంత్రి హరీశ్ రావు
గవర్నర్ స్థాయి తగ్గేలా మాట్లాడారు
8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టిన బీజేపీ, తెలంగాణకు వచ్చే సరికి కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి తారుమారయిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆ దొంగలను పట్టుకుని జైల్లో పెట్టింది తెలంగాణ ప్రభుత్వం దీంతో బీజేపీ వాళ్లు ఆగమాగం అవుతున్నారన్నారు. నిజంగా సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొనుగోలుపై మాకు సంబంధంలేదని టీవీల్లో వాళ్లు కేసుతో మాకు సంబంధం లేదని, మఠాధిపతులను కేసీఆర్ పంపారని చెబుతున్నారని, సంబంధం లేకపోతే కేసు ఆపమని ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. గవర్నర్ ఎలా ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. తాము రాహుల్ గాంధీ మీద పోటీ చేసిన కేరళకు చెందిన తుషార్ కోసం మాట్లాడామన్నారు. గవర్నర్ ఎందుకో తన ఎడీసీ తుషార్ కోసం మాట్లాడారన్నారు. ఎవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు గౌరవ ప్రదంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. తమ విలువ తగ్గించుకుని, స్థాయి తగ్గేలా మాట్లాడటం తగదన్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి, గవర్నర్ ను కలిసి అనుమానాలు నివృత్తి చేశారని తెలిపారు.