Hyderabad Metro Extends Its Offers: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం అందిస్తోన్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సూపర్ సేవర్ - 59, స్డూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది. ఈ మేరకు 2025, మార్చి 31 వరకూ ఆఫర్లను పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది. అటు, అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత కోసమే ఈ రుసుము వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.
మెట్రో అలైన్‌మెంట్ మార్పు
మరోవైపు, ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్ - బెంగుళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్ ఖరారు చేసింది. కారిడార్ - 4లో నాగోల్ - శంషాబాద్ విమానాశ్రయం వరకూ 36.6 కి.మీ మార్గానికి ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భంలో వెళ్లనుంది. మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్) తయారీ పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.
కారిడార్ VI (ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్) నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ పొడవును కవర్ చేస్తుండగా.. ఎల్బీ నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చంద్రాయణ్ గుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా NH మీదుగా ఈ మార్గం ఉంటుంది. కారిడార్ V రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయో డైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్ పొడిగింపుగా నిర్మిస్తారు. కారిడార్ VI (ఓల్డ్ సిటీ మెట్రో) ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపుగా నిర్మిస్తారు. ఎంజీబీఎస్ నుంచి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్ షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. అటు, రూ.8 వేల కోట్ల అంచనాతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు తుది మెరుగులు దిద్దుతుండగా.. త్వరలోనే కేంద్ర అనుమతుల కోసం పంపనున్నారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు చేపట్టనున్నారు.
Also Read: Hydra Ranganath: మూసీ నది సుందరీకరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన, కూల్చివేతలపై క్లారిటీ