TS Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు(సోమవారం) పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మాండూస్ తుపాను తీరందాటిన తర్వాత బలహీనపడిందని, ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ కేంద్రం తెలిపింది.  మాండూస్‌ తుపాను ప్రభావంతో హైదరాబాద్ లో వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి  నారాయ గూడ, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, లక్డీ కపూల్‌, నాంపల్లి, కోఠి, బేగంబజార్ తో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. 






హైదరాబాద్ లో తేలికపాటి వర్షం


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. నగరంలో కనిష్టంగా 19 డిగ్రీలు, గరిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య దిశ నుంచి గంటకు 6-8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 






తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు 


తెలంగాణపై మాండూస్ తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఈనెల 14 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో శీతల గాలులు వీస్తున్నాయి. మరో 12 గంటల్లో తుపాను మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడింది. ఇది ఉత్తర అంతర్గత తమిళనాడును ఆనుకుని ఉన్న దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక ఉత్తర కేరళ ప్రాంతంలో బలహీనపడింది. కానీ ఉపరితల ఆవర్తనం ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో  విస్తరించి ఉంది.  డిసెంబర్ 13 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.