Hyderabad News : తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్ కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్ టాప్ లు సీజ్ చేశారు పోలీసులు. సీఎం కేసిఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపణలతో పోలీసులు కార్యాలయానికి సీజ్ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది బయటకు పంపించారు పోలీసులు. కొంత కాలంగా ఎస్కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నోటీసులు ఇవ్వకుండా కార్యాలయాన్ని సీజ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. సునీల్ ఆపన్నహస్తం పేరిట రెండు ఫేస్ బుక్ పేజ్ లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 


కుట్ర పూరితంగా సీజ్ - కాంగ్రెస్ నేతలు 


కాంగ్రెస్  వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయాన్ని కుట్ర పూరితంగా సీజ్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు చర్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంపై పోలీసుల దాడి, సీజ్ చేయడాన్ని  తీవ్రంగా ఖండించారు.  ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా కార్యాలయాన్ని తనిఖీ చేస్తారని నేతలు నిలదీశారు. పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదంతో సునీల్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.   


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్.. 
కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయంపై పోలీసులు మఫ్టీలో వచ్చి ఆకస్మికంగా దాడి చేసి, సీజ్ చేయడం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో కాంగ్రెస్ వ్యవహారాలు జరుగుతాయని, కానీ ఇక్కడ తమకు సంబంధించిన ఆఫీసులో పోలీసుల పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం అన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్బంధం అలాగే కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురి అవుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


ఇది కూడా కాంగ్రెస్ కార్యాలయమే.. మల్లు రవి
తామ పార్టీ ఎప్పుడూ చట్టాలను గౌరవిస్తుందని, కానీ ఈ తీరుగా పోలీసులు వ్యవహరించడం సరికాదని సూచించారు. మీరు పద్ధతి ప్రకారం నోటీసులు ఇవ్వడమో, లేక ఏ కేసు విషయంలో వచ్చారన్నది చెప్పకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ భవన్ కాంగ్రెస్ తొలి ఆఫీసు అయితే, ఇది కూడా ఆఫీసుగా పనిచేస్తుందని కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారని, కనుక తాను కాంగ్రెస్ ప్రతినిధిగా, బాధ్యతగల వ్యక్తిగా వచ్చానని పోలీసులకు తెలిపారు. ఏ కేసు విషయంలో ఇక్కడికి వచ్చి తమ ఉద్యోగులను పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి పోలీసులు ఎక్కడికైనా వెళ్లి, ఎవరినైనా విచారించవచ్చునని.. అన్యాయంగా తమ ఆఫీసులోకి చొచ్చుకొచ్చి ఇలా చేయడం వెనుక కుట్ర దాగుందన్నారు.